మాటలు తక్కువ చెప్పటం.. చేతలు ఎక్కువ చూపటం లాంటివి రాజకీయ రంగంలో తక్కువగా కనిపిస్తాయి. రూపాయి పని చేసి పది రూపాయిల ప్రచారం చేసుకునే రోజుల్లో.. ఎన్నికల్లో తనను ఎన్నుకున్న నియోజకవర్గానికి అదే పనిగా ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టటం ద్వారా.. పిఠాపురం తనకెంత స్పెషల్ అన్న విషయాన్ని తరచూ స్పష్టం చేస్తుంటారు పవన్ కల్యాణ్. తాజాగా మరోసారి అదే అంశాన్ని అందరికి అర్థమయ్యేలా చేశారు.
శ్రావణమాసం సందర్భంగా మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన చీరల్ని ఆయన తన కానుకగా పంపారు. ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ.. తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పిఠాపురానికి తరచూ ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉంటారు పవన్ కల్యాణ్. శ్రావణమాసం సందర్భంగా నియోజకవర్గంలోని మహిళలకు అందించేందుకు వీలుగా 14 వేల చీరల్ని తన సొంత డబ్బులతో తెప్పించిన వైనం అందరిని ఆకర్షిస్తోంది.
పిఠాపురం పట్టణంలోని మహిళలకు ఈ చీరల్ని కానుకగా అందించారు. ఈ కార్యక్రమానికి తనకు వదిన.. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాల్ని నిర్వహించారు. ఉదయం5 గంటల నుంచే వేలాదిగా మహిళలు దేవాలయానికి పోటెత్తారు. వత్ర కార్యక్రమం పూర్తి అయిన తర్వాత చీరల్ని పంపిణీ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం తీరు చూస్తే.. మిగిలిన కూటమి నేతలకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తాను ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గానికి కూడా ఈ తరహాలో ప్రత్యేకంగా ఫోకస్ చేసింది లేదు. అందుకు భిన్నంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ మాత్రం.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం తనకెంత స్పెషల్ అన్న విషయాన్ని తెలియజేసే ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదని చెబుతున్నారు.
ఇందులో భాగంగా తరచూ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదంతా చూస్తే.. రానున్న రోజుల్లోనూ పిఠాపురంతో తన అనుబంధాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలన్న ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లుగా చెప్పక తప్పదు. ఏమైనా.. సమకాలీన రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న అధినేతలు.. సాధారణంగా తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకోవటం కనిపించదు. అందుకు మినహాయింపుగా ఉండే అతి కొద్ది మంది నేతల్లో పవన్ కల్యాణ్ ముందుంటారని చెప్పక తప్పదు.