వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మ్యాన్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. అయితే సెక్యూరిటీ వ్యవహారాలు చూడాల్సిన గన్ మ్యాన్లు పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకులుగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో పెద్దిరెడ్డి గన్ మ్యాన్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ కాలేషాను సస్పెండ్ చేస్తూ చిత్తూరు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కుమారుడిని పరామర్శించేందుకు ఈ నెల 23న పెద్దిరెడ్డి కుటుంబంతో సహా రాజమండ్రి వెళ్లారు. ఆ సమయంలో కోర్టు మిథున్ రెడ్డికి కల్పించిన ప్రత్యేక వసతులు దిండు, దుప్పటి, ఆహార పదార్థాలను తీసుకువెళ్లారు. వీటిని గన్ మ్యాన్ పట్టుకుని జైలులోకి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి భద్రత చూడాల్సిన ఉద్యోగి వ్యక్తిగత సహాయకుడిగా మారడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. గన్ మ్యాన్ కాలేషా సస్పెన్షన్ కు ఆదేశాలిచ్చింది.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన కాలేషా పెద్దిరెడ్డి గన్ మ్యాన్ గా చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సర్వీసు నిబంధనలు అతిక్రమించారని ప్రభుత్వం భావిస్తూ సస్పెండ్ చేయడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్దిరెడ్డిపై అక్కసుతోనే గన్ మ్యాన్ ను సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్నారు. కాగా, గతంలో ఎంపీ మిథున్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఆయన గన్ మ్యాన్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లేందుకు ప్రయత్నంచగా, ఆయనను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు పుంగనూరులో పెద్దిరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో మిథున్ రెడ్డి గన్ మ్యాన్ గాలుల్లో కాల్పులు జరపడంతో ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో పెద్దిరెడ్డిపై కక్షతో గన్ మ్యాన్లను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ విమర్శిస్తోంది.