మెగా హీరోల డిజాస్టర్ల పరంపరకు ఓజి బ్రేక్ వేసింది. సూపర్ బ్లాక్ బస్టర్ తో పవన్ కళ్యాణ్ పెద్ద ఊరట కలిగించాడు. ఇకపై ఇదే కొనసాగాలని ఫ్యాన్స్ కోరిక. మన శంకరవరప్రసాద్ గారు మీద ప్రీ రిలీజ్ వైబ్స్ పాజిటివ్ గా ఉండటంతో పాటు అనిల్ రావిపూడి మీద నమ్మకం వాళ్ళను నిశ్చింతగా ఉండేలా చేస్తోంది. అయితే దీని కన్నా ఎక్కువ ఫ్యాన్స్ చూపు పెద్ది వైపే ఉంది. ఎందుకంటే రంగస్థలం తర్వాత అంతకు మించిన ఊర మాస్ గెటప్ లో రామ్ చరణ్ చేయబోయే రచ్చ ఎలా ఉంటుందోనని తెగ ఎదురు చూస్తున్నారు. దానికి తోడు దర్శకుడు బుచ్చిబాబు ఇస్తున్న ఆఫ్ లైన్ ఎలివేషన్లు అంచనాలు పెంచేస్తున్నాయి.
కంటెంట్ గురించి ఎక్కువ లీక్స్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది కానీ కొన్ని అప్డేట్స్ చాలా క్రేజీగా ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే విడుదల చేసిన పోస్టర్ లో రామ్ చరణ్ పట్టాల మీద నిలుచుని ఎక్కడికో వెళ్తున్నట్టు అర్థం వచ్చే బాడీ లాంగ్వేజ్ తో కొత్తగా కనిపించాడు. ఇది తన పల్లెటూరి నుంచి ఢిల్లీకి వచ్చే సందర్భంలో వస్తుందని, అక్కడో పాటతో పాటు స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్ ఘట్టం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. దీనికి విడిగా ఎక్కువ సమయం కేటాయించి రీ రికార్డింగ్ చేస్తానని రెహమాన్ హామీ ఇచ్చినట్టు అంతర్గత సమాచారం.
ఇప్పటిదాకా సగానికి పైగానే షూటింగ్ పూర్తయిన పెద్దిని జనవరికల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నాడు బుచ్చిబాబు. తాజాగా జానీ మాస్టర్ ఆధ్వర్యంతో రామ్ చరణ్, జాన్వీ కపూర్ మీద ఒక పాటని షూట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత సంవత్సరం పైగా గ్యాప్ వచ్చేస్తున్న చరణ్ కు పెద్ది మీద మాములు నమ్మకం లేదు. బుచ్చిబాబు పనితనం పట్ల విపరీతంగా ఇంప్రెస్స్ అయ్యాడట. ఫిబ్రవరి నుంచి ప్రమోషన్లను పీక్స్ కి తీసుకెళ్ళబోతున్నారు. ముఖ్యంగా నార్త్ మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు సమాచారం. దీపావళికి ఆడియో సింగల్ అన్నారు కానీ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. చూడాలి.
















