తీవ్ర ఉద్రిక్తతల నడుమ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశాంత వాతావరణంలో తన నివాసానికి చేరుకున్నారు. 15 నెలల క్రితం ఆయన తాడిపత్రి రావడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపించింది. అయితే జిల్లా ఎస్పీ జగదీష్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఎటువంటి అమానుష ఘటనలు, అల్లర్లు చెలరేగలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డి భద్రత కోసం పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. సుమారు 672 మంది పోలీసుల బందోబస్తు మధ్య పెద్దారెడ్డి తాడిపత్రిలో తన నివాసానికి వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు తాడిపత్రిలో చోటుచేసుకున్న అల్లర్లతో పెద్దారెడ్డితోపాటు టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిని పోలీసులు పట్టణ బహిష్కరణ విధించారు. ఎన్నికల అనంతరం మూడు నెలల తర్వాత ముగ్గురు నేతలపైనా ఆంక్షలు తొలగించారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటూ వచ్చారు. పలుమార్లు బహిరంగంగా ప్రకటనలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తే రణరంగమేనంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకున్నారు.
దీంతో ఆయన తన స్వగ్రామంతోపాటు అనంతపురం వరకే పరిమితమయ్యే పరిస్థితి ఉండేది. 15 నెలలుగా తాడిపత్రిలో తన ఇంటికి రావడానికి పెద్దారెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేసినా పోలీసులు మాత్రం అనుమతించలేదు. పెద్దారెడ్డి భద్రతతోపాటు శాంతిభద్రతల సమస్య ఉంటుందని మాజీ ఎమ్మెల్యేను వెనక్కి పంపించేవారు. ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ లో పెద్దారెడ్డికి అనుకూలంగా తీర్పురాగా, పోలీసులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించడంతో పెద్దారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ సానుకూలంగా తీర్పు రావడంతోపాటు పెద్దారెడ్డిని ఆయన ఇంటికి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం కన్నెర్ర చేసింది.
అదే సమయంలో పెద్దారెడ్డి భద్రత కోసం అయ్యే ఖర్చును భరిస్తామని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో శనివారం ఉదయం పోలీసు భద్రత మధ్య పెద్దారెడ్డి తన ఇంటికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షించడంతో పెద్దారెడ్డి పంతం నెరవేరినట్లైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 15 నెలల తర్వాత తన ఇంటికి చేరుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎస్పీ జగదీష్ తోపాటు ఇతర పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, సుదీర్ఘ కాలం తర్వాత ఇంటికి వచ్చిన పెద్దారెడ్డికి కుటుంబ సభ్యులు దిష్టితీసి స్వాగతం పలికారు. ఇక ఈ నెల 11 నుంచి టీడీపీ కూటమి నేతల చేతిలో బాధితులుగా మారిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తానని పెద్దారెడ్డి వెల్లడించారు.
సుప్రీం తీర్పుతో పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టినా, తర్వాత ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే టెన్షన్ మాత్రం కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి తాడిపత్రిలో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. రాజకీయాలు ఎన్నికలు వరకే పరిమితం చేయకుండా, వ్యక్తిగత ఆధిపత్య పోరుగా మారడంతో ఎప్పటికప్పుడు వివాదాలు, ఉద్రిక్తలు నెలకొంటున్నాయి. దీంతో రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా తాడిపత్రి మారిపోయింది. ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డి రానున్న రోజుల్లో ఎలా నడుచుకుంటారు? జేసీ వర్గం రీయాక్షన్ ఎలా ఉండబోతుందనేదే భయాందోళనకు గురిచేస్తోంది. పోలీసులు కూడా ఇరువర్గాల కదలికలపై పూర్తి నిఘా ఉంచినట్లు చెబుతున్నారు.