ఉరమని ఉరుములా అనూహ్యమైన పిడుగులా కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బీఆర్ఎస్ పాలిట మారింది. గులాబీ తోటలో ఇపుడు శిశిరంలా ఈ పరిణామం దాపురించింది అని అంటున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరించింది అనుకోవాలి. ఎందుచేతనంటే ఎక్కడా తొందర పడలేదు. అన్నీ పద్ధతిగానే చేసుకుంటూ వెళ్ళింది. చివరికి చేతిలో నివేదిక ఉంటే దానిని అసెంబ్లీలో పెట్టి చర్చించి ఆ మీదట చర్యలు అంటోంది.
అసెంబ్లీ ముఖం చూడని వైనం :
ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయన గడచిన ఏణ్ణర్థం కాలంగా అసెంబ్లీ ముఖం చూడటం లేదు. ఆయన తన పార్టీ ఓటమి పాలు అయిన తరువాత ఎక్కువ సేపు ఫాం హౌస్ లోనే గడుపుతున్నారు అని అంటున్నారు. ఇక అసెంబ్లీలో విపక్షం బాధ్యతలు అన్నీ కూడా తన కుమారుడు కేటీఆర్ కి అలాగే అల్లుడు హరీష్ రావుకు అప్పగించారు. దాంతో వారే అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున తన వాణిని వినిపిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అనేక సార్లు కేసీఆర్ ని అసెంబ్లీకి రావాలని కోరారు. ఏ విషయం అయినా అసెంబ్లీ వేదికగానే చర్చించాలని కూడా ఆయన సూచిస్తూ వచ్చారు.
రేవంత్ తో ఫేస్ టూ ఫేస్ తప్పదా :
ఈ తీరుగానే మరో మూడున్నరేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ గడపాలని ఆలోచించి ఉండవచ్చు అంటున్నారు. అయితే సీన్ మారుతోంది. కేసీఆర్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సిన అనివార్యత అయితే ఏర్పడింది అని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన ఆరు వందలకు పైగా పేజీల నివేదికను అసెంబ్లీలోనే ప్రవేశపెట్టి చర్చించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. దాంతో కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సి ఉంటుందని అంటున్నారు.
ధాటీగా చెప్పాల్సింది ఆయనే :
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ మీదనే కమిషన్ నివేదిక పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిలో తప్పు ఒప్పులను చర్చించాలన్నా లేక తాము ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ ని తలపెట్టామని వివరించాలన్నా కూడా అసెంబ్లీకి మించిన వేదిక వేరేది ఉండదు. అక్కడ చర్చ జరిగితేనే జనాలలోకి కూడా బలంగా వెళ్తుంది. ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి రాకపోతే మాత్రం జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అయితే ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మూడవ వారంలో అసెంబ్లీ :
ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు మూడో వారంలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సమావేశాలలో అతి పెద్ద ఇష్యూగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండబోతోంది. అంతే కాదు పీసీ ఘోష్ నివేదిక మీద కాంగ్రెస్ బీజేపీ, మజ్లీస్, సీపీఐ బీఆర్ ఎస్ వంటి పార్టీలు అన్నీ చర్చించేందుకు వీలు ఉంటుంది. వివిధ పార్టీల సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఈ నివేదిక మీద ఏమి చేయాలన్న దాని మీద రేవంత్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా ప్రతిపక్ష పాత్ర పోషించి కాళేశ్వరం మీద తమ ప్రభుత్వ విధానాలను సమర్ధించుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.