ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 22న 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహణకు డిప్యూటీ సీఎం పవన్ ప్లాన్ చేశారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10,000 మంది మహిళలతో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, వారికి కానుకలు ఇవ్వనున్నారు. కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూజలకు 10,000 మంది వస్తారని అంచనా వేస్తుండగా, బ్యాచుల వారీగా విభజించి పూజలు చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఆగస్టు 22 చివరి శ్రావణ శుక్రవారం. అదే రోజు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణకు పవన్ ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. పిఠాపురంలో ప్రసిద్ధ పాదగయ క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇక్కడ శ్రీ కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారు కొలువై ఉన్నారు. పురుహూతిక అమ్మవారి క్షేత్రంలో మహిళలతో పూజలు చేయడం ద్వారా తనకు హిందు దేవతలు, సంప్రదాయాలు పట్ల ఎంతటి నిబద్ధతను పవన్ చాటుకుంటున్నారని అంటున్నారు.
సామూహిక పూజల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జనసేన కార్యకర్తలు, వలంటీర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుమారు 10,000 వేల మంది పూజల్లో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవడంతో బ్యాచుల వారీగా కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఐదు బ్యాచులుగా విడదీసీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళిక రచిస్తున్నారు. ప్రతి విడతకు ప్రత్యేకంగా నామకరణం చేశారు. వరుసగా అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అనే పేర్లతో ఈ పూజలు జరగనున్నాయి. ప్రస్తుతానికి 10 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నా శుక్రవారం నాటికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక పేర్లు నమోదు చేసుకున్న వారికి గురువారమే టోకెన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రతి కూపన్ పై వారు ఏ సమయంలో పూజకు రావాలో స్పష్టంగా రాస్తారు. ఆ సమయంలోనే వారిని పూజలకు అనుమతిస్తారు. ఇక పూజా కార్యక్రమాల అనంతరం మహిళలకు చీర, పసుపు కుంకుమలతో కూడిన గిఫ్ట్ బాక్సు పంపిణీ చేయనున్నారు.