ఓజి సినిమా బ్లాక్ బస్టర్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఓజి మూవీతో తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్న పవన్, ఆ సినిమాతో మంచి రికార్డులనే సృష్టించారు. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి పవన్ పోర్షన్ షూటింగ్ ఆల్రెడీ పూర్తైపోయింది.
ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ మరో సినిమాకు సైన్ చేసింది లేదు. అలా అని పవన్ సినిమాలు మానేసి రాజకీయాలకే పరిమితం అవుతున్నారా అంటే అదీ లేదు. మంచి కథలు వచ్చి, తనకు కుదిరిన టైమ్ లో సినిమాను పూర్తి చేసే వెసులుబాటు దొరికితే తప్పక చేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్న పవన్ గతంలో డేట్స్ ఇచ్చిన నిర్మాతల సినిమాలు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారట.
గతంలో పవన్ డేట్స్ ఇచ్చిన నిర్మాతల లైన్ లో అందరికంటే ముందుంది నిర్మాత రామ్ తాళ్లూరి. సుమారు రెండేళ్ల కిందటే రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని, ఈ మూవీకి వక్కంతం వంశీ కథను అందించనున్నరని వార్తలొచ్చాయి.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు తర్వాత పట్టాలెక్కలేకపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టును లైన్ లో పెట్టడానికి నిర్మాత రామ్ తాళ్లూరి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రైటర్ వక్కంతం వంశీ పవన్ కోసం రెండు మంచి స్క్రిప్టులను రెడీ చేసుకున్నారని, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యమని తెలుస్తోంది. మరి పవన్ తర్వాతి సినిమా విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటారా లేదా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొన్నాళ్లు ఆగి సినిమాలను చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.


















