విశాఖలోని సాగర తీరంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో రుషికొండ మీద వైసీపీ హయాలో భారీ భవనాలను నిర్మించారు. ఇవి నాలుగు బ్లాకులుగా నిర్మించారు. ఇందుకోసం నాలుగు వందల యాభై కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది అని ప్రచారం జరిగింది. ఈ భవనాలు జగన్ ముఖ్యమంత్రిగా విశాఖ నుంచి పాలిస్తే ఆయన అధికార భవనాల కోసం అని కూడా ప్రచారం జరిగింది. చిత్రమేంటి అంటే జగన్ రుషికొండ భవనాలను ఎపుడూ చూడలేదు. ఆయన కనీసం ఆ వైపునకు కూడా రాలేదు. ఈలోగానే మాజీ సీఎం అయిపోయారు. దాంతో రుషికొండ భవనాలు వైసీపీ దేని కోసం కట్టింది అన్నది మాత్రం ఒక రాజకీయ రచ్చగానే మిగిలింది.
ఈ భవనాలను టూరిజం అభివృద్ధి కోసమే అని వైసీపీ చెబుతోంది. గతంలో అక్కడ పాత భవనాలు ఉండేవని పెద్దగా టూరిజం యాక్టివిటీ ఉండేది కాదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్ హయాంలో అద్భుతమైన కట్టడాలని నిర్మించామని వాటిని టూరిజం భవనాల కోసం వినియోగించుకోకుండా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం మంత్రులు కీలా నేతలు విమర్శలు చేస్తున్నారు అంటోంది. వాటిని వినియోగంలోకి తేవాలని వైసీపీ కోరుతోంది.
ఇక రుషికొండ భవనాలు అన్నవి కేవలం జగన్ విలాసం కోసమే నిర్మించారు అని కూటమి పెద్దలు అంటున్నారు. తాజాగా అక్కడకు వెళ్ళి మొత్తం భవనాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఎంతో ప్రజా ధనం దుర్వినియోగం చేసారు అని విమర్శించారు. ఇదంతా జగన్ ఆనాడు అధికార నివాసం కోసమే నిర్మించడానికి అని ఆయన అంటున్నారు. ఈ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలో తాము ఆలోచిస్తామని ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతుందని అన్నారు. రుషికొండ భవనాలు ప్రభుత్వం ఆస్తి అని వాటిని పేలెస్ అని ఇక మీదట మాట్లాడుకోవద్దని కూడా పవన్ సూచించారు.
ఇదిలా ఉంటే పవన్ రుషికొండ భవనాలను ఇలా చూసి వచ్చారో లేదో అలా కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగం చేయాలన్న దాని కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయమే తీసుకుంది. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్ధిక మంత్రి పయ్యావుల, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయస్వామి ఉంటారు వీరు రుషికొండ భవనాలను పరిశీలించి ఆ భవనాలను దేని కోసం వినియోగించాలో సిఫార్సు చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ ఇలా అడుగు పెట్టారో లేదో అలా రుషికొండ భవనాలకు మోక్షం కలిగింది అని అంటున్నారు.