టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆ మూవీ.. జూలై 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ కూడా పడ్డాయి.
అయితే తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. ఆ సమయంలో తన అభిమానులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటిపై వైఎస్సార్సీపీ నాయకులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దాడులు చేయాలని అభిమానులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందించారు
సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. జనసేన కార్యకర్తలను దాడులకు ప్రేరేపించారని వైసీపీ నేతలు ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. అభిమానులను రెచ్చగొట్టి వివిధ చర్యలకు ప్రోత్సహించారని వెల్లడించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. “సోషల్ మీడియా కామెంట్స్ కు ఎవరూ నలిగిపోవద్దు. దమ్ముంటే తిరిగి కొట్టండి.. ఎట్లా దాడి చేయాలో అట్లా చేయండి. నెగటివ్ యాస్పెక్ట్స్ ను తిప్పి కొట్టండి. ఇది మన సివిలైజేషన్” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మీడియా ముందు వినిపించారు. ఆ తర్వాత కొట్టండి.. దాడి చేయండి.. నమిలేయండి.. అది మళ్లీ సివిలైజేషన్ అంట అంటూ విమర్శించారు.
“సార్ ఏమో కాషాయ వస్త్రాలు వేస్తుంటారు.. సనాతన ధర్మం అంటారు.. శాంతియుత వస్త్రాల్లో కనిపిస్తుంటారు.. కానీ మాటలేమో కొట్టేయండి.. నమిలేయండి.. దాడి చేయండి అంటున్నారు. ఇలా పబ్లిక్ గా మాట్లాడడం వల్ల మొన్న తణుకు మాజీ ఎమ్మెల్యే నాగేశ్వర రావు గారు కార్లో వెళ్తుంటే దానిపైకి ఎక్కి జన సైనికులు డ్యాన్స్ చేశారు” అని తెలిపారు. “అందుకు సంబంధించిన వీడియోస్ వైరల్ గా మారాయి. టీవీల్లో కూడా వచ్చాయి. అత్యంత దారుణంగా డ్యాన్సులు చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. రాళ్ళు రువ్వారు. నిరసన తెలుపుతూ రచ్చ రచ్చ చేశారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా.. మీరు ఎప్పుడైనా చూశారా?” అంటూ పవన్ పై ఫిర్యాదు చేసిన నాయకులు ప్రశ్నించారు.