ఎన్నికలకు ముందు వ్యక్తిగత హోదాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన రెండు కీలక హామీలు.. ఇప్పుడు మంటలు రేపుతున్నాయి. ఆయన చుట్టూ విమర్శలు అల్లుకునేలా చేస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ .. రెండు హామీలు ఇచ్చారు. అయితే.. ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఆయన వాటిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఆయా వర్గాలు తమ మాటేంటని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే.. వారికి అప్పాయింట్ మెంటు లభించడం లేదు.
1) సుగాలి ప్రీతి: నెల్లూరు జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైంది. ఇది.. 2018 లోనే జరిగింది. అయితే.. అప్పటి నుంచి ఈ విచారణ మందగించింది. నాటి టీడీపీ ప్రభుత్వం, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వాలు ఈ కేసును పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇక, 2023-24 మధ్య స్వయంగా పవన్ కల్యాణ్ ఈ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక సాయం చేశారు. వారి ఇంటికి వెళ్లారు. ఈ సమయంలోనే ఆయన తమ ప్రభుత్వం వస్తే.. ఫస్ట్ సంతకం ఈ కేసు విచారణపైనే ఉంటుందన్నారు.
కానీ, 15 మాసాలు అయినా కూడా ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ కానీ, ప్రభుత్వం కానీ.. ఈ కేసుపై దృష్టి పెట్టలేదు. దీనిని ప్రశ్నిస్తూ.. సుగాలి ప్రీతి కుటుంబం పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆ కుటుంబం ఇప్పటికి 8 సార్లు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. కానీ, పవన్ దర్శనం కానీ, అప్పాయింట్‌మెంటు కానీ లభించలేదు. దీనిపై కనీసంలో కనీసం.. ఒక్క హామీ కూడా లభించలేదు. దీనిపై గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమించాలని ప్రీతి కుటుంబం రెడీ అయింది.
2) సీపీఎస్: రాష్ట్రంలో 4 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. కంట్రి బ్యూటరీ పెన్షన్ స్కీంలో ఉన్న తమను ఒరిజినల్ పెన్షన్ స్కీంలోకి మార్చాలని వారు కోరుతున్నారు. ఈ విషయంలో హామీ ఇచ్చి.. అప్పట్లో వైసీపీ అధినేత జగన్ అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఉద్యోగులు ఉద్యమించారు. చివరకు ప్రభుత్వం పతనమైంది. ఆ తర్వాత.. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్.. తమ ప్రభుత్వవచ్చాక 100 రోజుల్లో మధ్యే మార్గంగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు వారి సమస్యను పరిష్కరించలేదు. ఇప్పుడు వారు కూడా పవన్ చుట్టూ తిరుగుతున్నారు. త్వరలోనే ఉద్యమానికి రెడీ అవుతున్నారు.