ఏ పని చేసినా ప్రత్యేకత చాటే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మనసును చూపించారు. సాధారణంగా రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత అభినందనలే అందుకుంటారు. కానీ పవన్ మాత్రం తన విజయం కోసం గుండె నిండా భక్తితో మొక్కుకున్న 96 ఏళ్ల వృద్ధురాలి సమర్పణను గమనించి, ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు.
పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించిన పవన్, తన విజయం వెనుక ఉన్న వెచ్చని గుండెలను గుర్తు పెట్టుకున్నారు. యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు పేరంటాలు తన వృద్ధాప్య పింఛన్ డబ్బులతో ప్రతి నెల కొంత పొదుపు చేసి, మొత్తంగా రూ.27 వేలు కూడబెట్టి, కులదేవత వేగులమ్మ తల్లికి గరగ చేయించిన విషయం పవన్ దృష్టికి వచ్చింది. ఇది తెలుసుకున్న ఆయన, ఆమెను తన మంగళగిరి క్యాంప్ ఆఫీసుకు ఆహ్వానించి, స్వయంగా విందు అందించారు.
పేరంటాలను నులక మంచం మీద కూర్చోబెట్టి, స్వయంగా వడ్డించి, మరీ కడుపు నింపేలా ఆతిథ్యం ఇచ్చిన పవన్ ఘనత సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ఆమెకు చీర, రూ.1 లక్ష నగదు బహుమతిగా ఇచ్చి, బయటకు వెళ్లి స్వయంగా వీడ్కోలు పలకడం ఒక నేతగా పవన్ సున్నిత మనసును చూపిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
పవన్ కల్యాణ్ ఈ చర్య ఒక రాజకీయ నాయకుడిగా కాక, ఒక మానవతావాది, నిజమైన ప్రజా నాయకుడిగా నిలిచేలా చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు, నెటిజన్ల హృదయాలను తాకుతోంది. “ఒక నిజమైన నాయకుడు ఇలా ఉండాలి” అనే కామెంట్లతో ఇప్పుడు పవన్ పేరు మరోసారి ప్రజల్లో మెరిసిపోతోంది.