పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురు చూపులకు తెర పడబోతుంది. గత రెండు మూడు ఏళ్లుగా ఆయన అభిమానులు హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన వీరమల్లు సినిమాను జులై 24, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మేకర్స్ నుంచి కౌంట్ డౌన్ షురూ అయింది. అన్ని చోట్ల ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. మరో వైపు ఓజీ కూడా అంతే వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
చాలా మంది పవన్ అభిమానుల్లో వీరమల్లు సినిమా కంటే ‘ఓజీ’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సాహో వంటి స్టైలిష్ యాక్షన్ సినిమాను రూపొందించిన సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా రూపొందుతోంది. పైగా ఈ సినిమాలో పవన్ కి చాలా ఇష్టమైన బ్యాగ్‌డ్రాప్‌లో కథ సాగుతుందట, అంతే కాకుండా పవన్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. అందుకే ఓజీ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో విడుదలకు ముందే వందల కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం అందుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా సుజీత్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఓజీకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కింది.
ఇప్పటి వరకు ఓజీ నుంచి కేవలం గ్లిమ్స్ మాత్రమే వచ్చాయి. సినిమాను సెప్టెంబర్ 25, 2025న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. విడుదలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. కనుక భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే టీజర్‌ను విడుదల చేయాలని దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన పోర్షన్ షూటింగ్‌ను ముగించుకున్నాడు, ఇటీవలే ఇతర నటీ నటులతో మొత్తం షూటింగ్‌ను సుజీత్ పూర్తి చేశాడు. దాంతో సుజీత్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ప్రమోషనల్ వీడియోలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగానే టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో ఓజీ టీజర్‌ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. వీరమల్లు సినిమా ఈనెల 24న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఓజీ సినిమా టీజర్‌ను కాస్త ముందుకు జరిపి వీరమల్లు సినిమాతో పాటు థియేటర్‌లో విడుదల చేస్తే రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా నడిచే థియేటర్‌లో అదే పవన్ కళ్యాణ్ మూవీ టీజర్‌ను వేయడం కరెక్ట్ కాదేమో అని కొందరు అంటున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదని, ఇప్పుడు జరిగితే కచ్చితంగా బాగుంటుంది కదా అంటూ కొందరు అంటున్నారు. సుజీత్ మాత్రం ఆగస్టు 15న టీజర్ విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఓజీ టీజర్ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.