‘పరదా’ మూవీ రివ్యూ నటీనటులు: అనుపమ పరమేశ్వరన్- దర్శన రాజేంద్రన్- సంగీత- రాగ్ మయూర్- రాజేంద్ర ప్రసాద్- గౌతమ్ మీనన్ తదితరులు సంగీతం: గోపీసుందర్ ఛాయాగ్రహణం: మృదుల్ సుజిత్ కథ: పూజిత శ్రీకంటి స్క్రీన్ ప్లే: పూజిత శ్రీకంటి- ప్రవీణ్ కాండ్రేగుల- ప్రహాస్ బొప్పుడి నిర్మాతలు: శ్రీనివాసులు- విజయ్ డంకాడ- శ్రీధర్ మక్కువ దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల సినిమా బండి.. శుభం.. లాంటి వైవిధ్యమైన చిన్న చిత్రాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రవీణ్ కంద్రేగుల నుంచి వచ్చిన కొత్త చిత్రం.. పరదా. అనుపమ పరమేశ్వరన్.. దర్శన రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: పడతి అనే గ్రామంలో ఓ వింత ఆచారం ఉంటుంది. ఆ ఊరిలో మహిళలు ఎవ్వరూ బయటి మగవారికి ముఖం చూపించకూడదు. ముఖాన్ని పరదాతో కప్పుకోవాలి. ఈ షరతును మీరితే ఊరి దేవత శాపం ఆ గ్రామం మీద పడి అనర్థాలు జరుగుతాయని భావిస్తారు. ఆ గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) ఊరి కట్టుబాట్లను గౌరవిస్తూ ఎక్కడా ముఖానికి పరదా తొలగిపోకుండా జాగ్రత్త పడుతుంటుంది. ఆమె ప్రేమించిన అబ్బాయికి తన ముఖం చూపించదు. తన ముఖమూ సుబ్బలక్ష్మి చూడదు. ఆమె ఇష్టపడ్డ అబ్బాయితోనే నిశ్చితార్థానికి సిద్ధమవుతున్న సమయంలో తన ముఖచిత్రం ఒక మ్యాగజైన్లో పడడం.. అది ఊరి వాళ్లకు తెలియడంతో కలకలం రేగుతుంది. ఊరి కట్టుబాటు ప్రకారం సుబ్బలక్ష్మి ఆత్మాహుతికి పాల్పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరి ఆ శిక్షను సుబ్బలక్ష్మి తప్పించుకోగలిగిందా.. అందుకోసం ఆమె ఎంత వరకు పోరాడింది.. చివరికి ఏం జరిగింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: అనగనగా ఒక ఊరు.. ఆ ఊర్లో ఆడవాళ్లందరూ ముఖం కనిపించకుండా పరదా వేసుకుని తిరుగుతుంటారు. పొరపాటున బయటి మగాళ్లకు ముఖం చూపిస్తే.. అనర్థం జరిగిపోతుందట. ఆ అమ్మాయిని చంపేస్తారట. ఇదేం వింత ఆచారం.. ఈ రోజుల్లో ఇలాంటి ఊరు ఎక్కడుంటుంది? అనిపిస్తుంది కదా? ‘పరదా’లో ఇలా చూపించారు అంటే.. అది బహుశా కొన్ని శతాబ్దాల కిందటి కథ అయ్యుంటుందేమో.. అందులోని పాత్రలన్నీ అడవి మనుషులేమో అనుకుంటాం. కానీ ఈ కథను వర్తమానంలో జరుగుతున్నట్లే చూపించారు. మరి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు ఆ కాన్సెప్ట్ ఎలా సింక్ అవుతుంది? తెర మీద జరిగేది నమ్మశక్యంగా అనిపించనపుడు అందులో ఉన్న ఎమోషన్ తో కనెక్ట్ కావడం కష్టమవుతుంది. పురుషులతో సమానంగా, వాళ్లను మించి మహిళలు సాధించి చూపిస్తున్న రోజుల్లో ఉంటూ.. మహిళలను ఈ ప్రపంచం తొక్కేస్తున్నట్లు పనిగట్టుకుని ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దడం ‘పరదా’లో ఉన్న మరో సమస్య. ఇందులో చెప్పాలనుకున్న విషయం మంచిదే అయినా.. కాన్సెప్ట్ రొటీన్ కు కొంచెం భిన్నంగా అనిపించినా.. రియాలిటీకి కొంచెం దూరంగా సన్నివేశాలను నడిపించడం.. ఒక దశ దాటాక ప్రీచీగా తయారవడంతో ‘పరదా’ ప్రేక్షకులను అనుకున్నంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. మంచి సందేశం ఇవ్వాలనుకున్న సినిమాలన్నీ గొప్ప సినిమాలు అయిపోవు. ఆ సందేశాన్ని ఎంత బాగా ప్రెజెంట్ చేశారు.. ప్రేక్షకులు కథతో ఎంతగా రిలేట్ అయ్యారన్న దాన్ని బట్టే ఆ సినిమా స్థాయి ఏంటన్నది నిర్ణయమవుతుంది. ఇప్పటికీ సమాజంలో పురుషాధిక్యత ఉందన్నది.. మహిళలు ఎదగడంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నది వాస్తవం. అదే సమయంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లడానికి అవసరమైన అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి సానుకూల వాతావరణం ఉండగా.. వర్తమానంలో కథను నడుపుతూ మహిళలను బాధితులుగా చూపిస్తూ.. పురుషులను విలన్లుగా ప్రొజెక్ట్ చేస్తూ ‘పరదా’ చిత్రాన్ని నడిపించారు. సినిమా అంతా ఇలాగే వన్ సైడెడ్ గానే సాగుతుంది. ఈ విషయంలో సర్దుకోగలిగినా.. గ్రామంలో జరిగే వ్యవహారాలు మాత్రం అతిశయోక్తిలా అనిపిస్తాయి. పరదా తీస్తే ఆత్మాహుతి అంటూ మరీ విడ్డూరంగా అనిపించే పాయింటు మీద కథను నడిపించడంతో దాని తాలూకు ఎమోషన్ ప్రేక్షకులకు పట్టడం కష్టమవుతుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండడం వల్ల ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాల వరకు ప్రేక్షకుల అటెన్షన్ రాబడుతుంది ‘పరదా’. కథానాయికకు ఒక ఫేమస్ ఫొటోగ్రాఫర్ వల్ల ఇబ్బంది తలెత్తుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లి కలవడం పెద్ద విషయమే కాదు. ఐతే దాని మీదే గంటకు పైగా స్టోరీ నడిపించాలనుకోవడం దర్శకుడు చేసిన పెద్ద రిస్క్. ఈ రిస్కుని ఛేదించడానికి అవసరమైన పకడ్బందీ కథనం ఇందులో మిస్సయింది. కొన్ని సన్నివేశాలు హృద్యంగా అనిపించినా.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తించేలా కథనం సాగకపోవడం ప్రతికూలమైంది. ఒక జర్నీలో మనిషి పరివర్తన చెందడం అనే చాలాసార్లు చూసిన పాయింట్ మీద నెమ్మదిగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అక్కడక్కడా కొన్ని సీన్లు ఇంట్రెస్టింగ్ గా అనిపించినా.. నరేషన్లో వేగం లేకపోవడం.. కథ పెద్దగా ముందుకు కదలకపోవడం సమస్యగా మారింది. ఫస్టాఫ్ లో కథ పరంగా కొన్ని మలుపులుండడం.. సన్నివేశాల్లో కొంచెం వేగం ఉండడం వల్ల కొంత ఎంగేజ్ చేసినా.. రెండో అర్ధం మాత్రం నిరాశపరుస్తుంది. ‘పరదా’ క్లైమాక్స్ ఏంటన్నది చాలా ముందుగానే ఒక అంచనా వచ్చేసేలా ద్వితీయార్దంలో కథనం నడుస్తుంది. ముగింపు సన్నివేశాలు అంచనాలకు తగ్గట్లే సాగినప్పటికీ హృద్యంగా అనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా సినిమా మీద అభిప్రాయం మారిపోదు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే సరిపోదు.. అది ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా ఉండాలి. బిలీవబిలిటీ అనేది కూడా చాాలా కీలకం. అది లేకపోవడం వల్ల ‘పరదా’కు . సందేశాన్ని సుగర్ కోటెడ్ గా ఇస్తే బాగుండేది కానీ.. మొదట్నుంచి చివరి వరకు ఏదో పాఠం చెబుతున్నట్లుగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. మహిళల సమస్యలు.. వారి సాధికారత మీద తీసుకున్న క్లాస్ ఓవర్ డోస్ అయిపోయి సినిమా ప్రీచీగా తయారైంది.
నటీనటులు: ‘పరదా’లో పెర్ఫామెన్సుల పరంగా ఏమీ లోటు లేదు. అనుపమ పరమేశ్వరన్ సుబ్బలక్ష్మి పాత్రను ఎంతో ఇష్టపడి.. ఓన్ చేసుకుని చేసిందని అడుగడుగునా తెలుస్తుంటుంది. ఆ పాత్ర కోసం ఆమె పూర్తిగా అవతారం మార్చుకుని.. చక్కగా హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. చాలా త్వరగా అనుపమను మరిచిపోయి సుబ్బుతో కనెక్ట్ అయిపోతాం. తీవ్ర మనోవేదన అనుభవించే సన్నివేశాల్లో అనుపమ నటన కట్టిపడేస్తుంది. టాలెంటెడ్ మలయాళ నటి దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలో రాణించింది. కొన్ని సన్నివేశాల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. ఐతే ఆ పాత్ర ఇంకా బలంగా ఉండాల్సిందనిపిస్తుంది. రత్నం పాత్రలో సంగీత కూడా ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్ కు ఆమె ఒక నిండుదనం తెచ్చింది. హీరోయిన్ తండ్రి పాత్రలో బలగం నటుడు.. ఆమె ప్రేమికుడిగా రాగ్ మయూర్ కూడా బాగా చేశారు. క్యామియో రోల్ లో గౌతమ్ మీనన్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ వేయలేకపోయాడు. సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘పరదా’లో మంచి ప్రమాణాలు కనిపిస్తాయి. గోపీసుందర్ మంచి పాటలు.. నేపథ్య సంగీతంతో సినిమాకు బలమయ్యాడు. మృదుల్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. చిన్న బడ్జెట్ సినిమా అయినా విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్లో క్వాలిటీ కనిపిస్తుంది. పూజిత శ్రీకంటి.. ప్రహాస్ బొప్పుడిలతో కలిసి ప్రవీణ్ కాండ్రేగుల రాసిన స్క్రిప్టులో విషయం ఉంది. కానీ ఈ కథకు వర్తమాన నేపథ్యాన్ని తీసుకోవడం మైనస్ అయింది. వెనుకటి కాలం కథగా.. నాగరికతకు దూరంగా ఉన్న ప్రపంచంలో దీన్ని ప్రెజెంట్ చేసి ఉంటే ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతి కలిగేదేమో. వెరైటీ కాన్సెప్ తీసుకున్నా.. ట్రీట్మెంట్ విషయంలో రొటీన్ టెంప్లేట్ ఫాలో అయిపోవడంతో ‘పరదా’ ఎఫెక్టివ్ గా తయారు కాలేకపోయింది.
రేటింగ్- 2.75/5