గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ – ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మరోసారి భీకర ఘర్షణలు జరిగాయని స్థానిక మీడియా నివేదించింది. ఈ ఘర్షణల్లో ఇరువైపుల పౌరులు మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి. దీంతో.. ఇరు దేశాల మధ్య తాను మధ్యవర్తిత్వం వహిస్తానని జేయూఐ-ఎఫ్ చీఫ్ ఎంట్రీ ఇచ్చారు.
అవును… పాకిస్తాన్ – ఆఫ్గన్ దళాలు బుధవారం తెల్లవారుజామున భీకర సరిహద్దు ఘర్షణలకు దిగాయి. ఇందులో భాగంగా ఆఫ్గన్ లోని కాందహార్ ప్రావిన్స్, పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతాల మధ్య కీలక సరిహద్దు జిల్లా అయిన స్పిన్ బోల్డాక్ లో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారీ పోరాటం జరిగిందని ఆఫ్గాన్ కు చెందిన ఖామా ప్రెస్ నివేదించింది.
పాకిస్తాన్ దళాలు నివాస ప్రాంతాలపై షెల్ దాడులు చేశాయని, దీనివల్ల చాలా మంది పౌరులు తమ ఇళ్లను వదిలి పారిపోయారని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో… పాకిస్తాన్ ఆ ప్రాంతంలోని పౌర ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భారీ ఆయుధ దాడులను ప్రారంభించిందని కాందహార్ నివాసితులు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
ఈ వ్యవహారంపై పాక్ భద్రతాధికారులు స్పందించారు. ఇందులో భాగంగా… అఫ్గాన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని.. దాని ట్యాంకులను, సైనిక పోస్ట్ లను దెబ్బతీశామని పేర్కొన్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ దళాలు, తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) సంయుక్తంగా తమ భూభాగంలోని పోస్ట్ లపై కాల్పులు జరిపారని పాక్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
అయితే… ఆఫ్గాన్ కాల్పులకు పాక్ దళాల నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చిందని తెలిపింది. ఇదే సమయంలో… టీటీపీకి చెందిన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు. మరోవైపు.. అఫ్గాన్ లో ఖోస్ట్ ప్రావిన్స్ లోని డిప్యూటీ పోలీసు ప్రతినిధి తాహిర్ అహ్రర్ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించారు.
ఈ స్థాయిలో పాక్ – ఆఫ్గన్ సరిహద్దులు భగ్గుమంటున్న నేపథ్యంలో ‘జమైత్ ఉలేమా – ఈ – ఇస్లాం – ఫ్లజ్ (జేయూఐ-ఎఫ్)’ పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ స్పందించారు. ఇందులో భాగంగా… ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలోనూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానని అన్నారు.
కాగా… ఆఫ్ఘనిస్తాన్ లో వరుస పేలుళ్లకు పాకిస్తానే కారణమని ముత్తాఖీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబూల్ లో ఇటీవల జరిగిన వైమానిక దాడుల తర్వాత ఆఫ్ఘన్ సరిహద్దులో జరిగిన ప్రతిదాడుల్లో 58 మంది పాక్ సైనికులు మృతి చెందారని, 30 మంది గాయపడ్డారని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆదివారం వెల్లడించారు.
ఇలా 58 మంది సైనికులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించిన తర్వాత.. పాక్ స్పందించింది. ఇందులో భాగంగా… ఆ వాదనలను తోసిపుచ్చుతూ, తమ సైనికులు 23 మందిని మాత్రమే కోల్పోయినట్లు పేర్కొంది.