భారత సైన్యం మరోసారి సత్తా చాటింది.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి అయిన హషీం మూసా అలియాస్ సులేమాన్ మూసాను భారత బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన “ఆపరేషన్ మహాదేవ్” విజయవంతంగా ముగియగా, ముగ్గురు తీవ్రవాదులను హతమార్చడంలో భారత సైన్యం, CRPF, జమ్మూకాశ్మీర్ పోలీసులు కీలక పాత్ర పోషించారు.
ఈ ఆపరేషన్‌కి ముందుగా నిఘా వర్గాలు, స్థానిక సంచార జాతుల నుండి ముఖ్యమైన సమాచారం అందింది. శ్రీనగర్ సమీపంలోని హర్వాన్ ప్రాంతంలోని డాచిగామ్ అటవీ ప్రాంతంలో తీవ్రవాదులు దాగి ఉన్నట్లు పక్కా ఆధారాలతో సైన్యం రంగంలోకి దిగింది. దాదాపు 14 రోజుల పాటు జరిగిన నిఘా తర్వాత సోమవారం చాకచక్యంగా దాడి చేసి వారిని మట్టుబెట్టారు.
పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దానికి బాధ్యుడైన హషీం మూసా అల్లుకున్న కుట్రలు వెలుగులోకి వచ్చాయి. మాజీ పారా కమాండో అయిన ఈ వ్యక్తి, పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. ఆయుధ నిపుణుడైన ఈతను, పాక్ ఆర్మీ నేరుగా నియమించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఉగ్రవాదులకు ఆహారం, రహదారి, సమాచారం అందిస్తున్న వ్యక్తులను దర్యాప్తు బృందాలు గుర్తించి, ఆ వివరాల ఆధారంగా ఆపరేషన్ ప్రణాళిక రూపొందించారు. స్థానికుల సహకారం, సాంకేతిక నిఘా వనరులతో మిళితంగా సాగిన ఈ ఆపరేషన్‌కి ‘మహాదేవ్’ అని పేరు పెట్టారు. భారత సైన్యం చురుకుగా స్పందించి ఉగ్రవాదుల ముఠాను ఏరివేయడం ద్వారా మరోసారి దేశ ప్రజలకు భద్రతను నిలబెట్టింది.