జనవరి 1న కొత్త సంవత్సరమే కాదు.. కొత్త చరిత్రకు నాంది పడుతోంది. 60 ఏళ్ల విప్లవోద్యమం ఆ రోజుతో పరిసమాప్తం కానుంది. కొత్త ఏడాది తొలి రోజున తామంతా భేషరతుగా లొంగిపోతామని, అంతవరకు తమపై అణచివేత ఆపాలని కోరుతూ మావోయిస్టు పార్టీ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఎంఎంసీ- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సంయుక్త కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో శుక్రవారం సంచలన లేఖ విడుదలైంది. వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లు నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కకావికలమైంది. కొన్నిరోజులుగా ఈ విషయమై అంతర్మథనం సాగుతుండగా, మావోయిస్టులు రెండు వర్గాలుగా విడిపోయారన్న చర్చ కూడా సాగింది. లొంగిపోదామని కొందరు.. సాయుధ పోరాటం కొనసాగిద్దామని మరికొందరు పట్టుబట్టడం.. అదే సమయంలో కేంద్ర బలగాలు విరుచుకుపడటంతో మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో లొంగిపోయి ప్రాణాలైన దక్కించుకోవాలన్న ఆలోచనతో మావోయిస్టుల నుంచి సామూహిక లొంగుబాటు ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు.
ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టు పార్టీ పూర్తిగా చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. 60 ఏళ్లు ఉద్యమంపై కేంద్రం తీవ్ర అణచివేతను కొనసాగించడంతో మావోయిస్టులు ఉపిరి సలపలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో తమకు ఫిబ్రవరి వరకు సమయం ఇస్తే పార్టీలో చర్చించి సాయుధ పోరాటం విరమిస్తామని కొద్దిరోజుల క్రితం ప్రతిపాదించారు. అయితే కేంద్రం మాత్రం షరతులు, సమయాలు వంటి వేవీ కుదరవు.. లొంగిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని తేల్చిచెప్పింది. దీంతో మావోయిస్టులు మరో మెట్టు దిగివచ్చారు. జనవరి 1నే సామూహిక లొంగుబాటుకు సిద్ధమని తెలియజేస్తూ తాజాగా లేఖ విడుదల చేశారు. ఒక్కొక్కరుగా కాదు.. అందరం ఒకేసారి లొంగిపోతామని ఎంఎంసీ కమిటీ ప్రతినిధి అనంత్ బహిరంగంగా ప్రతిపాదించారు.
ఎక్కడెక్కడో ఉన్న మావోయిస్టులు అంతా కలిసి లొంగిపోయేందుకు ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్ కూడా విడుదల చేశాడు అనంత్. దీంతో ఆపరేషన్ కగార్ విజయవంతమైనట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చేఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేస్తామని.. నక్సల్స్ విముక్త భారత్ ఆవిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భద్రతా బలగాలకు పూర్తిగా సహకారం అందిస్తూ ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చడంతో మావోయిస్టుల కోటలు చీలిపోయాయి. గత ఏడాదిన్నరగా సాగుతున్న సుదీర్ఘ ఆపరేషన్ తో వందల మంది మావోయిస్టులు మరణించారు. అంతేసంఖ్యలో లొంగుబాట్లు జరిగాయి. ఈ పరిస్థితుల్లో అడుగు ముందుకు వేయలేని దుస్థితికి చేరుకున్న మావోయిస్టులు సామూహిక లొంగుబాటును ప్రకటించారని అంటున్నారు.
దేశంలో అభివృద్ధికి అంతర్గత తీవ్రవాదం ప్రధాన సమస్యగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. 2009లోనే దేశం నుంచి తీవ్రవాదాన్ని తరిమేయాలని నిర్ణయించాయి. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించింది. ఆ ఐదేళ్లు మావోయిస్టులపై తీవ్ర అణచివేతను కొనసాగించింది. దీంతో అప్పటివరకు దండకారణ్యంతోపాటు ఏవోబీ అటవీ ప్రాంతాలు, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బిహార్ వంటి పశ్చిమ రాష్ట్రాల్లో ప్రభావం చూపిన మావోయిస్టులు ఎదురుదెబ్బలు తిన్నారని గుర్తుచేస్తున్నారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ 2.0ను చేపట్టింది. మావోయిస్టులపై తీవ్ర నిర్బంధం అమలు చేయడంతో మావోయిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొన్నిసార్లు పోలీసులపై ఎదురుదాడికి ప్రయత్నించి ప్రభుత్వానికి సవాల్ విసిరేవారు.
ఈ నేపథ్యంలో 2024లో మరోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం.. ఆపరేషన్ కగార్ ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్ ను ప్రత్యేకంగా పర్యవేక్షించడం మొదలుపెట్టడంతో మావోయిస్టు పార్టీ పెను సవాల్ ఎదుర్కోవాల్సివచ్చింది. 2026 మార్చి 31 నాటికల్లా దేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదని హోంమంత్రి అమిత్ షా బలగాలకు లక్ష్యం నిర్దేశించారు. అదే సమయంలో మావోయిస్టు పార్టీలో కొత్త రిక్రూట్మెంట్లు జరగకుండా పకడ్బందీగా అడ్డుకున్నారు. మరోవైపు భద్రతా బలగాలకు ఆధునిక ఆయుధాలను సమకూర్చారు. అత్యాధునిక డ్రోన్లతో మావోయిస్టుల వేట ముమ్మరం కావడంతో ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు జరిగాయి. దీంతో గత ఏడాదిన్నర కాలంగా సుమారు వేయి మందికి మించి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిబాట్లను ప్రభుత్వం ప్రోత్సహించింది.
ప్రభుత్వం, భద్రతా బలగాల పట్టుతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అయింది. మావోయిస్టుల్లో అత్యున్నత కమిటీలుగా చెప్పే కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో దాదాపుగా ఖాళీ అయ్యాయి. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న వంటివారు లొంగుబాట్లు మావోయిస్టు పార్టీని ఆలోచనలో పడేసింది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్, పీఎల్ జీఏ కమాండర్ హిడ్మా, ఒకప్పుడు ఏవోబీలో గడగడ లాడించిన సుధాకర్ వంటివారు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. దీంతో మావోయిస్టు దళాలను ముందుకు నడిపించే నాయకుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని కొనసాగించలేమని నిర్ణయానికి వచ్చిన మావోయిస్టులు జనవరి 1 వరకు గడవు కోరుతూ తాజాగా లేఖ రాశారు. ఈ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో కానీ, మరో 30 రోజుల్లో 60 ఏళ్ల ఉద్యమానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.












