ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. వాహనదారులకు సడన్ షాకిచ్చాయి. కాలం చెల్లిన వాహనాలకు పెట్రలో గానీ, డీజిల్ గానీ పొయ్యకూడదని ఆదేశించాయి. దీన్ని దశలవారీగా అమలు చేస్తోన్నాయి. తొలి విడతలో ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో ఈ విధానం నేటి నుంచి అమలులోకి వచ్చింది.
వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో చమురు కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇందులో భాగంగా నేటి నుండి కొత్త, కఠినమైన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చాయి. 10 సంవత్సరాలు పైబడిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు పైబడిన పెట్రోల్ వాహనాలకు ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలోని ఏ ఫ్యూయల్ పంప్ లోనూ ఇంధనం లభించదు.
కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ తో కలిసి ఆయిల్ కంపెనీలు దీన్ని అమలును చేపట్టాయి. ఈ కొత్త నిబంధనలను పటిష్టంగా అమలు చేయడానికి- ఢిల్లీ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు అయ్యాయి.
ఈ కెమెరాలు.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన్ డేటాబేస్ తో అనుసంధానం అయ్యాయి. ఈ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి. వాటి కాల పరిమితిని తనిఖీ చేస్తాయి. వాహన్ డేటా బేస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తాయి. వాహనం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే- పెట్రోల్ బంక్ సిబ్బంది పెట్రోల్ లేదా డీజిల్ పొయ్యడానికి అనుమతించరు.
ఒకవేళ ఏ ఫ్యూయల్ స్టేషన్ అయినా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాలను సీజ్ చేసి, కేంద్ర ప్రభుత్వ స్క్రాపేజ్ పాలసీ కింద స్క్రాప్ సెంటర్లకు పంపే అవకాశం ఉంది.
ఈ నిషేధం ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినప్పటికీ ఢిల్లీలో ఈ నిబంధన పరిధిలోకి వచ్చే వాహనాలకు కూడా వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధనలను ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్ (నోయిడా), సోనిపట్ వంటి ఇతర ఎన్సీఆర్ జిల్లాల్లో కూడా అమలులోకి వస్తుంది.
ఈ నిబంధనలను బట్టి చూస్తే- వాహన కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్ లేదా డీజిల్ సెకెండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటే- ఈ నిబంధనను దృష్టిలో ఉంచుకోవడం తప్పనిసరి. వాహనం మోడల్, రిజిస్ట్రేషన్ ను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవడం అవసరం.