గడగడలాడించే స్థాయికి ఎదగడం.. అనుకోని పరిస్థితుల్లో ఆ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్లి.. కొంత కాలానికి తిరిగి రావడం.. మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటడం.. ఇలా అలవాటైన ఫార్మాట్లో సాగిపోతుంది ‘ఓజాస్ గంభీర’. పవన్ కళ్యాణ్ ఫిల్మోగ్రఫీలోనే బాలు.. పంజా లాంటి చిత్రాలను గుర్తు చేసే ‘ఓజీ’కి మలయాళ లూసిఫర్ టచ్ కూడా ఇచ్చాడు సుజీత్. దీని వల్ల ఏదో ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు. ఐతే కథ సంగతి ఎలా ఉన్నా.. సూపర్ స్టైలిష్ గా కనిపించే పవన్ కళ్యాణ్ కు బలమైన ఎలివేషన్ సీన్లు పడడం.. యాక్షన్ ఎపిసోడ్లు పేలిపోవడంతో ‘ఓజీ’ పవన్ అభిమానులనే కాక మాస్ ప్రేక్షకులనూ ఎంగేజ్ చేస్తుంది. విపరీతమైన బిల్డప్ తర్వాత వచ్చే ఓజాస్ పరిచయ సన్నివేశం బాగానే పేలింది. దాన్ని మించి ఇంటర్వెల్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తుంది. సినిమాలో మేజర్ హైలైట్ ఇంటర్వెల్ ఎపిసోడే అనడంలో సందేహం లేదు. ఇలాంటి ఎలివేషన్ సీన్లు కొత్తేమీ కాదు కానీ.. అదేమీ చూడని సన్నివేశం కాదు.. అయినా సరే మాస్ ప్రేక్షకులకు అది పూనకాలు తెప్పిస్తుంది. దర్శకుడు.. కెమెరామన్.. మ్యూజిక్ డైరెక్టర్.. ముగ్గురూ కలిసి తమ బెస్ట్ ఇచ్చారు ఆ ఎపిసోడ్లో.
బ్యాంగ్ బ్యాంగ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత.. ద్వితీయార్దంలో ఫాలో అప్ కూడా బాగానే ఉంది. ‘ఓజీ’ ఫస్ట్ టీజర్ గ్లింప్స్ లో చూపించిన పోలీస్ స్టేసన్ ఎపిసోడ్ సినిమాలో మరో హైలైట్. ఇక్కడ దర్శకుడిగా సుజీత్ పనితనం కనిపిస్తుంది. ఈ సన్నివేశాన్ని కన్సీవ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఐతే ఇదే టెంపోను తర్వాత కూడా కొనసాగించి ఉంటే ‘ఓజీ’ స్థాయి వేరుగా ఉండేది. ఓజాస్ ముంబయికి తిరిగి వచ్చాక తర్వాత ఏం చేస్తాడనే విషయంలో పెద్దగా సర్ప్రైజులేమీ లేవు. హీరో-విలన్ మధ్య ఎత్తులు పై ఎత్తులు అంత ఆసక్తికరంగా అనిపించవు. ఎంతసేపూ హీరోను ఎలివేట్ చేయడమే లక్ష్యంగా సన్నివేశాలు సాగుతుంటే.. సినిమా ఏకపక్షంగా మారిపోయి ఆసక్తి సన్నగిల్లిపోతుంది. హీరో ముందు విలన్ పాత్ర అంత బలంగా కనిపించకపోవడం మైనస్. కథలో ఏదైనా గొప్ప ట్విస్టు ఉంటుందేమో అని ఆశిస్తే.. నిరాశ తప్పదు. కొన్ని మలుపులు ఉన్నప్పటికీ అవి అంతగా పండలేదు. ద్వితీయార్ధాన్ని నిలబెట్టేంత డ్రామా కథలో లేకపోయింది. ఆర్డీఎక్స్ కంటైనర్ వ్యవహారం ఒక దశ దాటాక చికాకు పెడుతుంది. ఇంత పెద్ద యాక్షన్ సినిమాను నడిపించేంత వెయిట్ ఆ కాన్సెప్టులో లేకపోయింది. సినిమాలో ప్రథమార్థంలో ఉన్న వేగం ద్వితీయార్ధంలో కనిపించదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులో టేకింగ్ బాగున్నప్పటికీ.. ఆ ఎపిసోడ్ పేలిపోయే రేంజిలో అయితే లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. పవన్ అభిమానులకు అయితే ‘ఓజీ’ కనువిందుగా అనిపిస్తుంది. ఎలివేషన్లకు.. యాక్షన్ సీక్వెన్సుల్లో మెరుపులకు ఇందులో లోటు లేదు. కానీ అంతకుమించి విశేషంగా ఏముందని చూసే సామాన్య ప్రేక్షకులకు మాత్రం ఒకింత నిరాశ తప్పదు. నటీనటులు: సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక పవన్ అత్యంత స్టైలిష్ గా.. బెస్ట్ లుక్స్ లో కనిపించిన సినిమా.. ఓజీ. మొత్తంగా కెరీర్లోనే పవన్ ది బెస్ట్ గా కనిపించిన చిత్రాల్లో ఇదొకటిగా చెప్పొచ్చు. ఓజాస్ గంభీర పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ‘హరిహర వీరమల్లు’లో మాదిరి దాగుడుమూతలు ఆడినట్లు కాకుండా ఇందులో పవన్ మీద యాక్షన్ ఘట్టాలను కొంచెం నమ్మశక్యంగా అనిపించేలా తీశారు. పవర్ కూడా బాగానే ఎఫర్ట్ పెట్టాడు. పోలీస్ స్టేషన్ సీన్ సహా కొన్ని ఎపిసోడ్లలో పవన్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. తన అభిమానులకు ఏం కావాలో అది పవన్ ఈ సినిమాతో ఇచ్చేశాడు. ప్రియాంక అరుల్ మోహన్ బాగా చేసింది. పవన్ తో ఆమె జోడీ ఏమాత్రం కుదురుతుందో అని సందేహించిన వాళ్లకు సినిమా సమాధానం చెబుతుంది. తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినా ప్రియాంక తన ప్రాధాన్యతను చాటుకుంది. విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. కానీ ఆ పాత్రకు ఆరంభంలో ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్లు పవర్ ఫుల్ గా ఆ పాత్ర అనిపించదు. కానీ ప్రతి సన్నివేశంలో ఇమ్రాన్ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేశాడు. మరో విలన్ సుదేవ్ నాయర్ ఆకట్టుకున్నాడు. సత్య దాదాగా కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ రాణించాడు. అర్జున్ దాస్ పాత్ర నిరాశపరుస్తుంది. సినిమాలో దాని ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. గీత పాత్రలో శ్రియా రెడ్డి బాగా చేసింది. కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ తన ఉనికిని చాటుకుంది. తేజ్ సప్రు.. ఉపేంద్ర లిమాయే.. మిగతా నటీనటులంతా మామూలే. సాంకేతిక వర్గం: ‘ఓజీ’ సినిమాకు తెర ముందు పవన్ హీరో అయితే.. తెర వెనుక కథానాయకుడు తమనే. జైలర్.. లియో లాంటి సినిమాలకు తన సమాధానం ‘ఓజీ’ అంటూ తమన్ అంత ధీమాగా ఎందుకు చెప్పాడో.. ‘ఓజీ’ థియేటర్లో అడుగు పెట్టిన తొలి నిమిషం నుంచే అర్థమవుతుంది. బీజీఎంతో అతను తాండవం ఆడేశాడు. సూపర్ స్టైలిష్ గా సాగుతూ.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది స్కోర్. పాటలు.. బీజీఎం అన్ని మిక్స్ అయిపోయి ఒక టెంపోలో సాగుతాయి. ఎలివేషన్ సీన్లలో తమన్ బీజీఎం మోతెక్కిపోయింది. రవి.కె.చంద్రన్ ఛాయాగ్రహణం కూడా సూపర్బ్. విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి. సుజీత్ అభిరుచికి తగ్గట్లుగా స్లైలిష్ విజువల్స్ తో సినిమాకు మంచి లుక్ తీసుకొచ్చారు రవిచంద్రన్. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. చాలా రిచ్ గా తీశారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ సుజీత్.. తన అభిమాన కథానాయకుడిని ఎంత స్టైలిష గా చూపించాలి.. ఎలాంటి ఎలివేషన్లు ఇవ్వాలి అన్న దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ విషయంలో అతను విజయవంతం అయ్యాడు. తన టేకింగ్ చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్లు.. ఎలివేషన్ సీన్లు బాగా తీర్చిదిద్దుకున్నాడు. కానీ తన కథలో కొత్తదనం చూపించలేకపోయాడు. కథనం కూడా కొంచెం ఎగుడుదిగుడుగా సాగుతుంది. డ్రామా అనుకున్నంతగా పండలేదు. ‘సాహో’ ఫలితం ఎలా ఉన్నా అందులో చాలా ట్విస్టులు.. సర్ప్రైజులుంటాయి. ఈ కోణంలో అతను నిరాశపరిచాడు.
రేటింగ్ – 3.5/5


















