గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై మంచి హిట్ అందుకున్న కమిటీ కుర్రోళ్ళు మూవీ కాంబో రిపీట్ కానుంది. ఆ సినిమాతో తన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు యదు వంశీ.. ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత నిహారిక కొణిదెలతో మరో ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం యదు వంశీ- నిహారిక కాంబినేషన్ లో రానున్న మరో సినిమా 2026 లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే కమిటీ కుర్రోళ్ళు మూవీ భారీ విజయం సాధించడంతో.. ఇప్పుడు ఆ కాంబో రిపీట్ అవుతుందని తెలియడంతో అప్పుడే ఆడియన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరో విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
అయితే కమిటీ కుర్రోళ్ళు సంచలన విజయం సాధించిన తర్వాత.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 2 ఇప్పటికే షూటింగ్ లో ఉంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో సంగీత శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా నిహారిక నిర్మిస్తున్నారు. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు మూవీ డైరెక్టర్ తో మళ్లీ వర్క్ చేయనున్నారు.
కాగా, కమిటీ కుర్రోళ్ళు సినిమాలో అనేక ప్రత్యేక అంశాలు ఉన్నాయి. ఒకేసారి.. 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవ్వడం విశేషం. రూ.9 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా.. థియేటర్స్ లో రూ.18.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. నాన్- థియేట్రికల్ ద్వారా రూ.6 కోట్లను వసూలు చేసింది.
తద్వారా మొత్తం కమిటీ కుర్రోళ్ళు మూవీ రూ.24.5 కోట్ల వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో అవార్డుల విషయంలో కూడా సత్తా చాటింది. సైమా 2025లో నిహారిక కొణిదెల ఉత్తమ తొలి నిర్మాతగా నిలిచారు. అందరి దృష్టిని ఆకర్షించారు. సందీప్ సరోజ్ ఉత్తమ డెబ్యూ యాక్టర్ గా అవార్డు గెలుచుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో కమిటీ కుర్రోళ్ళు మూవీ.. రెండు ప్రతిష్టాత్మక గౌరవాలను గెలుచుకుంది. కమిటీ కుర్రోళ్ళు జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా గుర్తింపు పొందింది. డైరెక్టర్ యదు వంశీ ఉత్తమ డెబ్యూ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇప్పుడు యదు వంశీ, నిహారిక కాంబోలో రానున్న మరో సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.