గతంలో అమెరికాలో కాల్పుల కలకలం ఘటనలు ఎక్కువగా వినిపించేవనే సంగతి తెలిసిందే. ప్రధానంగా వీకెండ్ వచ్చిందంటే పబ్లిక్ ప్లేసెస్ లో ఇలాంటి వరుస ఘటనలు తీవ్ర కకలం రేపేవి. అయితే… న్యూయార్క్ సిటీలో తుపాకీ హింస రికార్డు స్థాయిలో తగ్గిపోయిన వేళ తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని అధికారులు వెల్లడించారు!
అవును… అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యూయార్క్ సిటీలోని రద్దీగా ఉన్న ఓ క్లబ్ లో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరి పరిస్థితిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సందర్భంగా… న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ జెస్సికా టిష్ వివరాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా… బ్రూక్లిన్ లోని క్రౌన్ హైట్స్ పరిసరాల్లోని టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్ వద్ద స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వివాదం చెలరేగిన అనంతరం పలు ఆయుధాలతో ఈ కాల్పులు జరిగినట్లు అనుమానిస్తున్నామని జెస్సికా టిష్ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారని విలేకరులకు తెలిపారు. ఇదే సమయంలో… ఘటనాస్థలం నుంచి 36 షెల్ కేసింగ్ లను, సమీపంలోని వీధిలో ఓ 9 ఎంఎం తుపాకీని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు చెప్పిన టిష్… కాల్పుల్లో గాయపడిన ఎనిమిది మందిలో ముగ్గురు మహిళలు ఉన్నరని.. వారంతా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మరణించిన వారిలో 27 ఏళ్ల వ్యక్తి, 35 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల వ్యక్తి ఉన్నారని టిష్ చెప్పారు.
ఇదే క్రమంలో… ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో న్యూయార్క్ సిటీలో తుపాకీ హింస రికార్డు స్థాయికి తగ్గిందని.. కాల్పుల ఘటనలు, మృతుల సంఖ్య అత్యల్పంగా ఉందని.. అలాంటి సమయంలో తాజా ఘటన జరిగిందని.. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి, నిందితులను గుర్తిస్తామని జెస్సికా టిష్ వెల్లడించారు. ఈ సందర్భంగా స్పందించిన మేయర్ ఎరిక్ ఆడమ్స్.. కాల్పుల తర్వాత ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా… కమ్యూనిటీలో క్రైసిస్ మేనేజ్మెంట్ బృందాలను సమీకరించామని ఆయన తెలిపారు.