అగ్రరాజ్యంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాకింగ్ అంశం ఏమంటే.. ఐదుగురిని బలి తీసుకున్న ఈ ప్రమాదంలో టూరిస్టు బస్సు దేనిని ఢీ కొట్టకుండానే ఐదుగురు ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. ప్రఖ్యాత నయాగరా జలపాతం అందాల్ని చూసేందుకు వెళ్లి.. తిరిగి వచ్చే సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగాన్ని నియంత్రించటంలో ఫెయిల్ కావటమే ఈ ప్రమాదానికి అసలు కారణంగా చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..
నయాగరా జలపాతం నుంచి న్యూయార్క్ కు తిరిగి వస్తున్న వేళలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో ఐదుగురు మరణించగా.. పలువురు గాయాల బారిన పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న చాలామంది సీటు బెల్టు పెట్టుకోకపోవటంతో వారిని సులువుగా బస్సు నుంచి బయటకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.
బస్సు దేన్ని ఢీ కొట్టలేదని.. స్పీడ్ ను కంట్రోల్ చేయటంలో డ్రైవర్ ఫెయల్యూర్ ఈ ప్రమాదానికి అసలు కారణంగా స్థానిక మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 54 మంది ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం12.40 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. బస్సు బోల్తా పడిన వైనం గురించి సమాచారం అందుకున్నంతనే స్థానిక యంత్రాంగం స్పందించింది. నాలుగు హెలికాఫ్టర్లు.. పలు అంబులెన్సులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. పర్యాటకుల్లో అత్యధికులు భారత్.. చైనా.. ఫిలిప్పీన్స్ కు చెందిన వారున్నారు. జరిగిన ప్రమాదాన్ని తీవ్ర విషాద ఘటనగా న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బస్సు ఢీ కొట్టకుండానే.. వేగాన్ని నియంత్రించటంలో జరిగిన వైఫల్యం.. బస్సు తిరగబడిన వైనం షాకింగ్ గా మారింది.