ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల పంపిణీ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసే విధంగా ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్డులు మండల కార్యాలయాలకు చేరుతున్నాయి. అర్హతే ప్రామాణికంగా కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, అర్హత కలిగిన వారు జాబితాల్లో తమ పేరు చెక్ చేసుకునే అవకాశం కల్పించారు.
కాగా, ప్రభుత్వం రాష్ట్రంలో తాజాగా ఇచ్చే కార్డులతో కలిపి మొత్తం 1,45,97,486 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఫోటో, కుటుంబసభ్యుల పేర్లు, QR కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. దీని ద్వారా లబ్ధిదారుల గుర్తింపు మరింత తేలిక అవుతుందని సర్కార్ చెబుతోంది. కొత్త స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులు సెప్టెంబర్ నెల నుంచి రేషన్ సరుకులు పొందుతారని అధికారులు తెలిపారు. త్వరలో స్మార్ట్ ఈ-పోస్ మిషన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడు ఇస్తున్న స్మార్ట్ కార్డులను ఈ యంత్రం ద్వారా స్వైప్ చేస్తే కార్డుదారుడి వివరాలు వస్తాయి. సిమ్, వైఫై, హాట్‌స్పాట్, బ్లూ టూత్, టచ్ స్క్రీన్ వంటి ఆధునిక సదుపాయాలతో, ఆండ్రాయిడ్ సాంకేతికతతో ఈ నూతన వ్యవస్థ పని చేస్తుంది.
ఇక.. ఇప్పటికే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రేషన్ కార్డుల అర్హుల జాబితాలను అధికారులు ఖరారు చేసారు. ఇదే సమయంలో మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందిస్తున్న https://vswsonline.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా హోమ్ పేజీలో ఉన్న ‘Service Request Status Check’ లింక్‌పై క్లిక్ చేసి, దరఖాస్తు సమయంలో పొందిన నంబర్‌ను నమోదు చేయాలి. మీ రేషన్ కార్డు దరఖాస్తు ఏ దశలో ఉందో పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక.. స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ద్వారా నిత్యవసరాల పంపిణీ పూర్తి పారదర్శకంగా చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.