భారత ఉపఖండం… భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు. భౌగోళిక, రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి రీత్యా వీటన్నిటినీ కలిపి ఉప ఖండం అని పిలుస్తుంటారు. వీటిలో శ్రీలంకకు 65 ఏళ్ల కిందటే ఓ మహిళ ప్రధానమంత్రి అయ్యారు. భారత్ కు 60 ఏళ్ల క్రితమే ఆ ఘనత దక్కింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లకూ మహిళలు ప్రధానులు అయ్యారు. భూటాన్ లో రాజరికం ఉంది కాబట్టి చాన్స్ లేదు. చాలా చిన్నది కాబట్టి మాల్దీవుల సంగతి వదిలేద్దాం. కానీ, నేపాల్ లో మాత్రం మహిళలకు ఇప్పటివరకు ప్రధానిగా అవకాశం రాలేదు. అనూహ్యంగా ఇప్పుడు మాత్రం ఓ మహిళ ఆ పీఠంపై కూర్చున్నారు.
పొరుగు దేశం నేపాల్‌లో కేవలం నాలుగు రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలి.. జెన్ జెడ్ యువత ఆందోళనలతో రాజీనామా చేసేశారు. దీంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సోషల్ మీడియాపై ఆంక్షలు కారణంగా పేర్కొన్నా.. నేపాల్ లో నెపో కిడ్స్ (ధనవంతులు, నాయకుల పిల్లల) విలాసాలు చూసి తిరుగుబాటు మొదలైంది. అది చివరకు ఓలి సీటుకే ఎసరు తెచ్చింది. మరి కొత్త ప్రధానమంత్రి ఎవరు? అంటే ఆ దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి. శుక్రవారం ఆమె తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా ఓ అరుదైన రికార్డు అందుకున్నారు.
నేపాల్ కు తొలి మహిళా చీఫ్ జస్టిస్ సుశీల కర్కినే. ఇప్పుడు తొలి మహిళా ప్రధాని కూడా అయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించే వరకు సుశీల పదవిలో కొనసాగనున్నారు. కాగా, ఉద్యమకారులైన జెన్ జెడ్ యువతతో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ ఆశోక్ రాజ్ సిగ్దెల్, సామాజికవేత్తలు, న్యాయ నిపుణులు పలు దశల చర్చలు సాగించిన అనంతరం సుశీల పేరుకు ఆమోదం లభించింది.
సుశీల 1952 జూన్ 7న జన్మించారు. టీచర్ గా జీవితాన్ని ప్రారంభించినా.. న్యాయవాదిగా స్థిరపడ్డారు. విధి నిర్వహణలో నిజాయతీ పరురాలిగా పేరుగాంచారు. 2009లో నేపాల్ సుప్రీంకోర్టులోకి అడుగుపెట్టారు. 2016లో చీఫ్ జస్టిస్ అయ్యారు. తాజా జెన్ జెడ్ ఉద్యమంలోనూ సుశీల కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యమైన విషయం ఏమంటే ఈమె భారత్ లోని బనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. భారత ప్రధాని మోదీతో స్నేహ సంబంధాలు ఉన్నట్లు ఇటీవలే తెలిపారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గాన్ని గతంలో బనారస్ గానూ పిలిచేవారు.
శ్రీలంకకే కాదు ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధాని సిరిమావో బండారు నాయకే. ఈమె 1960, 1970, 1994లో మూడుసార్లు ప్రధాని అయ్యారు. ప్రధానిగా ఉన్న తన భర్త హత్యతో సిరిమావో రాజకీయాల్లోకి వచ్చారు. -భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్ర అందరికీ తెలిసిందే. ఈమె తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా ప్రధానిగా పనిచేశారు. ఇందిర 1966 నుంచి 1977 వరకు, 1980-84 వరకు ప్రధానిగా వ్యవహరించారు. -పాకిస్థాన్ తొలి మహిళా ప్రధాని బేనజీర్ భుట్టో 1998-90 మధ్య, 1993-96 మధ్య రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. బేనజీర్ తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో కూడా ప్రధానిగా వ్యవహరించారు. -బంగ్లాదేశ్ కు తొలి మహిళ ప్రధాని బేగం ఖలీదా జియా. 1991, 2001లో రెండుసార్లు ప్రధాని అయ్యారు. బంగ్లాలో గత ఏడాది పదవిని వీడి భారత్ కు వచ్చేసిన షేక్ హసీనా 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. 2009, 2014, 2019, 2024లోనూ ఈమె ప్రధానిగా తన పార్టీని గెలిపించారు. కొసమెరుపుః శ్రీలంకకు 2024 నుంచి మహిళా ప్రధానమంత్రే కొనసాగుతున్నారు. ఆమె పేరు హరిణి అమరసూరియా. 1994 ఆగస్టు 19 నుంచి నవంబరు 12వ వరకు చంద్రిక కుమారతుంగ ప్రధానిగా వ్యవహరించారు. మరో విశేషం ఏమంటే శ్రీలంకకు ఈమె 11 ఏళ్లు అధ్యక్షురాలిగానూ పని చేశారు. -ఇందిర, బేనజీర్ దారుణ హత్యలకు గురయ్యారు. హసీనా పదవిని వదిలేసి పారిపోయారు.
 
			



















