వైఎస్సార్ పార్టీకి వీర విధేయుడిగా అంతకు మించి జగన్ భక్తుడిగా వైసీపీలో ఉంటూ జనంలోకి ప్రాచుర్యంలోకి అలా వచ్చిన వారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన 2014లో తొలిసారి వైసీపీ నుంచి గెలిచారు. ఆ అయిదేళ్ళూ వైసీపీ విపక్షంలో ఉన్నపుడు ఆయన తనదైన పెద్ద గొంతుక చేసి వైసీపీకి కొమ్ము కాశారు. అసెంబ్లీ లోపలా బయటా ఆయన వైసీపీకి కొండంత అండగా ఉండేవారు. జగన్ మీద ఈగ వాలనిచ్చేవారు. ఆయన మంచి మాటకారి. ప్రత్యర్థులను విమర్శలతో చెడుగుడు ఆడగల నైపుణ్యం ఉంది. అంతకు మించి ఫైర్ బ్రాండ్.
తనకు అన్ని అర్హతలు ఉన్నా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినపుడు మంత్రి పదవి దక్కలేదు అన్న బాధ ఆయనలో ఉంది. తొలి విడతలో రాలేదు అంటే తరువాత అవకాశం అని సర్దిచెపుకున్నారు. కానీ రెండో విడత సైతం రాకపోయేసరికి ఆయన ఇక భరించలేకపోయారు. దాంతో మీడియా ముందే ఆవేదన భరితుడై ఏడ్చేశారు. నాటి నుంచే ఆయనలో బాధ కాస్తా తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా మారింది. అలా మెల్లగా ఆయన టీడీపీ వైపు మళ్ళారు. అలా ఆ పార్టీ పెద్దలకు దగ్గర అయి వైసీపీ నీడ నుంచి బయటకు వచ్చారు.
ఇక చూస్తే 2024 ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ని ఆయనకు పార్టీ అధినాయకత్వం ఇచ్చింది. అంతే కాదు చంద్రబాబు లోకేష్ సైతం ఆయన పట్ల పూర్తి నమ్మకం ఉంచారు. దాంతో కోటంరెడ్డి గెలిచి నిలిచారు. అలా ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి పదవి మీద ఆశలు పెంచుకున్నారు. కానీ తొలి విడతలో మంత్రి నారాయణకు ఆనం రామనారాయణరెడ్డికు అవకాశం దక్కింది. ఇక నారాయణ అయిదేళ్ళ మంత్రి అని వేరేగా చెప్పనక్కరలేదు, దాంతో విస్తరణలో ఆనం వారిని పక్కన పెడితే రెడ్డి సామాజిక వర్గం కోటాలో కచ్చితంగా ఇంకొకరికి చాన్స్ వస్తుంది. ఇపుడు దాని కోసమే కోటంరెడ్డి భారీ ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు.
కోటంరెడ్డి చంద్రబాబు లోకేష్ గుడ్ లుక్స్ లో ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. ఆయన ముక్కుసూటితనం తో పాటు పార్టీ అధినాయకత్వం పట్ల నిబద్ధత గా ఉండడమే కాకుండా తన బలం తన లీడర్ షిప్ క్వాలిటీస్ తో నెల్లూరులో పార్టీని ముందుకు నడిపించగలరు అని అనుచరులు అంటున్నారు. అందుకే విస్తరణలో కోటంరెడ్డికి మంత్రి పదవి గ్యారంటీ అని భావిస్తున్నారుట.
అయితే నెల్లూరు జిల్లాలో చూస్తే పోటీ హెచ్చుగానే ఉంది. ఆనంని తప్పిస్తే పార్టీలో సీనియర్ మోస్ట్ బాబుకు ఎంతో సన్నిహితుడైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఆయన గతంలో గెలవకపోయినా ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రిని చేశారు. ఆయన కూడా ఇదే తనకు లాస్ట్ చాన్స్ ని మంత్రిగానే రాజకీయ విరమణ చేయాలని చూస్తున్నారు అంటున్నారు. ఇక వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఫ్యామిలీ కూడా మంత్రి పదవి మీద ఆశలు పెంచుకుంది అని అంటున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరులో నల్లపురెడ్డి కుటుంబం మీద గెలిచింది దాంతో పాటు ఇటీవల జరిగిన పరిణామాలతో ఆమె పేరు మారుమోగింది. నల్లపురెడ్డి ఫ్యామిలీకి అడ్డుకట్ట వేయాలంటే ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని అంటున్నారు. మహిళా కోటా కూడా ఆమెకు అదనంగా క్వాలిఫికేషన్ గా ఉంది అని చెబుతున్నారు. మరి ఈ పోటీని తట్టుకుని కోటంరెడ్డికి మంత్రి పదవి ఇస్తారా అంటే చూడాలి మరి ఏమి జరుగుతుందో. మొత్తానికి అయితే కోటంరెడ్డి మాత్రం మంత్రి కుర్చీ తొందరలో తనదే అన్న ధీమాతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.















