నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి వార్నింగ్ లేఖ ఇచ్చిన వైనం సంచలనంగా మారింది. కారణం.. ముఖానికి మాస్కు వేసుకొని ప్రజాప్రతినిధి ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ లేఖ అందజేయటం.. అందులో రూ.2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని స్పష్టం చేయటం కలకలాన్ని రేపింది. ఈ నెల 17న జరిగిన ఈ ఉదంతాన్ని పోలీసులు బయటకు రాకుండా గుట్టుగా విచారణ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే నెల్లూరు లోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఎంపీ సతీమణి.. కోవూరు ఎమ్మెల్యేకు తమ లేఖ అందజేయాలని చెబుతూ అక్కడి భద్రతా సిబ్బంది చేతికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆఫీసు సిబ్బంది సదరు లేఖను తెరిచి చూడగా.. రూ.2 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామని రాసి ఉంది.
దీంతో.. ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే ఈ బెదిరింపు లేఖకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీ.. ఎమ్మెల్యేకు తెలియజేయటంతో వారు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఈ బెదిరింపు లేఖ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు,. దీనికి కారణమైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక దళాల్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి అల్లూరు మండలం ఇస్కపాళెంకు చెందిన ఒకరిని అనుమానితుడిగా గుర్తించారు. మరో వ్యక్తి ఎంపీ- ఎమ్మెల్యే ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడ్ని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు ఇవ్వటం.. అతని వద్ద నాలుగు ఫోన్లు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ వచ్చిన అంశం వాస్తవమేనని.. దీనిపై త్వరలోనే విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఈ బెదిరింపు లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.