నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోవూరు మండలంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం పొతిరెడ్డిపాలెం వద్ద ముంబై నేషనల్ హైవే ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఓ కారు అదుపుతప్పి.. ఓ ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో ఉన్న వెంకట రమణయ్య (50) అక్కడిక్కడే మరణించారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడగా.. పోలీసులు, స్థానికులు నెల్లూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ.. ఐదుగురు మెడికల్ స్టూడెంట్స్ కూడా మరణించారు. మరో విద్యార్థి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బుచ్చిరెడ్డి పాలెంలో ఫ్రెండ్ అక్క నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తున్నక్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను జీవన్, విఘ్నేష్, నరేశ్, అభిసాయి, అభిషేక్‌గా గుర్తించగా.. మౌనిత్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు అభిషేక్, జీవన్, నరేష్, యజ్ఞేష్, అభిసాయితో పాటు ఇట్లో ఉన్న వెంకట రమణయ్య మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.