చంద్రబాబుది యాభై ఏళ్ల రాజకీయ అనుభవం. దేశంలో ప్రస్తుతం ఉన్న ఎందరో జాతీయ స్థాయి నాయకుల కంటే ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. బాబు తలచుకోవాలే కానీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలరు. గతంలో ఆయన చాలా సార్లు అలా చక్రాన్ని తిప్పారు కూడా. బాబు కంటే జూనియర్లు దేశంలో కీలక పదవులలో ఉన్నారు. అయితే చంద్రబాబు ఒక కమిట్మెంట్ తో ఏపీ రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఆయన తలచుకుంటే నేషనల్ పాలిటిక్స్ లో ఎపుడో అరంగేట్రం చేసేవారు. అంతవరకూ ఎందుకు ఆయన యునైటెడ్ ఫ్రంట్ కి కన్వీనర్ గా నాలుగున్నర దశాబ్దాల వయసులోనే ఉన్నారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న ఎన్డీయే కూటమికి సైతం కన్వీనర్ గా పనిచేశారు.
ఇదిలా ఉంటే నారా లోకేష్ ని జాతీయ స్థాయిలో ఒక మీడియా తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఆ చానల్ ఒక ఇబ్బందికరమైన ప్రశ్ననే సంధించింది బాబు ఫ్యూచర్ లో ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని. దానికి లోకేష్ బదులిస్తూ అలాంటి ఆలోచనలు లేవని చెప్పారు బాబు రెండు కళ్ళూ ఏపీ మీదనే ఉన్నాయని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది కానీ మేము గల్లీ లీడర్లం జాతీయ రాజకీయాల కంటే మాకు సొంత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని లోకేష్ చెప్పారు. గల్లీ లీడర్లమని అనకుండా ఏపీ కే మా ప్రాధాన్యత అని లోకేష్ అన్నా తప్పు లేదని కానీ అలా అనడం బాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ కి కొంత ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు.
ఇక మరో ఇబ్బందికరమైన ప్రశ్న కూడా లోకేష్ కి ఇదే సందర్భంలో ఎదురైంది. 2019లో బీజేపీకి ఎన్డీయేకు యాంటీగా విపక్షాలను కలుపుకుని బాబు జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు కదా అప్పట్లో ఆయన ప్రధాని పదవి కి అభ్యర్థి అని ప్రచారం సాగింది కదా అని ఆ మీడియా అడిగిన దానికి కూడా లోకేష్ జవాబు చెబుతూ మనుషులం ఒక్కో సారి తప్పులు చేస్తూంటామన్నట్లుగా మాట్లాడారు. అంటే ఎన్డీయేతో విడిపోవడాన్ని తప్పుగానే ఆయన చూస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్రం సాయం చేయలేదని పేర్కొంటూ టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది ధర్మ పోరాట దీక్షలు అన్నీ కూడా ఆనాడు చేశారు. మరి అందులో ధర్మం లేదని లోకేష్ భావిస్తున్నారా అన్న కొత్త చర్చ కూడా ఇపుడు సాగుతోంది.
కేంద్రంలో ఎన్డీయే జట్టులోనే ఉంటామని పదే పదే లోకేష్ చెప్పారు. అంతే కాదు 2029 లోనూ తాము కలసి పోటీ చేస్తామని చెప్పారు. ఇంతలా ఎన్డీయేకు మద్దతు ఉందని తెలియచేయడం వరకూ ఓకే కానీ గతంలో చేసినవి తప్పులు అనడం తమను తాము తక్కువ చేసుకోవడం సబబేనా అన్న చర్చ వస్తోంది. ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలు తమ సొంత వ్యక్తిత్వాంలో ముందుకు సాగాలని చూస్తున్నాయి. తమిళనాడు కానీ కేరళ కానీ ఈ విషయంలో ముందున్నాయి. రాష్ట్రాలే బలమైనవి అని నినాదంగా వారు వినిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో గల్లీ లీడర్లుగా స్టేట్ లీడర్లను లోకేష్ చెప్పదలచుకున్నారా అన్నది కూడా ప్రశ్నగా తలెత్తుతోంది. ఏది ఏమైనా లోకేష్ ఈ ఇంటర్వ్యూలో ఎన్డీయే మీద విపరీతమైన అభిమానం చూపించే ప్రయత్నంలో కొంత తడపాటుకు గురి అయ్యారా అన్నదే అంతా అంటున్న మాటగా ఉంది.