బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.కూటమిలోని భాగస్వామ్య పార్టీ జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు ఈ ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.రిజల్ట్స్ ట్రెండ్స్ ఆయన బలమైన పునరాగమనాన్ని సూచిస్తున్నాయి.2020లో కేవలం 43 సీట్లే గెలుచుకున్న జేడీయూ, ఈసారి 80కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది.నితీశ్ ప్రభుత్వం రాబోతుందని అందుకు బిహార్ సిద్ధంగా ఉందని జేడీయూ పార్టీ ఎక్స్ పోస్టులో తెలిపింది.”బిహార్ రాజకీయాల నుంచి జంగిల్ రాజ్, అవినీతి, బంధుప్రీతిని నితీశ్ కుమార్ తరిమేశారు. ఇది సుపరిపాలన ప్రభావం, ఇది బిహార్ విశ్వాసం” అని రాసింది”బిహార్ మహిళల విశ్వాసం గెలిచింది. ఎన్డీయే గెలిచింది, బిహార్ గెలిచింది” అని తెలిపింది.
ఇంతకీ నితీశ్ కుమార్ బిహార్‌లో తీసుకొచ్చిన మార్పులేంటి?
కుర్మి వర్గానికి చెందిన నితీశ్ కుమార్ 1951, మార్చి 1న జన్మించారు. ఆయన తండ్రి పేరు కవిరాజ్ రామ్ లఖన్ సింగ్. తల్లి పేరు పరమేశ్వరీ దేవి. కవిరాజ్ భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధేయవాది విభూతి అనురాగ్ నారాయన్ సిన్హాకు ఆయన సన్నిహితుడు. వృత్తిరీత్యా కవిరాజ్ ఆయుర్వేద వైద్యుడు.1972లో బిహార్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి నితీశ్ మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. తొలుత బిహార్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1973లో నితీశ్.. మంజు కుమారి సిన్హాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. 2007లో న్యూమోనియాతో మంజు మరణించారు.
నితీశ్ కుమార్ కాలేజీలో చదివే రోజుల్లో రాజ్ కపూర్ చిత్రాలను ఎంతగానో ఇష్టపడే వారని ‘నితీశ్ కుమార్: ద రైజ్ ఆఫ్ బిహార్’ పుస్తకంలో అరుణ్ సిన్హా ప్రస్తావించారు. చదువుకునే రోజుల్లో ఆయనకు 150 రూపాయల స్కాలర్ షిప్ అందేది. దాంతో ఆయన ఎక్కువగా పుస్తకాలు కొనుక్కునేవారు.నితీశ్ కుమార్‌ను సోషలిస్టు నాయకుడిగా చెబుతుంటారు. ప్రముఖ సోషలిస్టు నాయకులైన జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఎస్‌ఎన్ సిన్హా, వీపీ సింగ్‌లతో ఆయన కలిసి పనిచేశారు.1974 నుంచి 1977 మధ్య జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో నితీశ్ పాల్గొన్నారు. ఎస్‌ఎన్ సిన్హా నేతృత్వంలోని జనతా పార్టీలో చేరారు.
1977లోనే తొలిసారి హర్‌నౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్‌పై నీతీశ్ పోటీచేశారు. అయితే ఓటమి పాలయ్యారు. 1985లో ఇదే స్థానం నుంచి తొలిసారి ఆయన శాసన సభకు ఎన్నికయ్యారు.1989లో జనతా దళ్ జనరల్ సెక్రటరీ పదవిని నితీశ్ చేపట్టారు. అదే ఏడాది తొలిసారి బాడ్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మొత్తంగా ఆరుసార్లు ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు.వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం(1998-99)లో నితీశ్ కేంద్ర రైల్వే, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, డాయిసాల్ రైలు ప్రమాదం జరగడంతో కేంద్ర మంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 285 మంది మరణించారు.
రైల్వే మంత్రిగా కొంత కాలమే పనిచేసినప్పటికీ.. ఇంటర్నెట్‌లో రైలు టిక్కెట్ల బుకింగ్ సదుపాయం, భారీగా కొత్త రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు తెరవడం లాంటి సంస్కరణలు తీసుకొచ్చారు.తత్కాల్ విధానాన్ని కూడా ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారు.తర్వాత ఏర్పాటైన ఎన్‌డీఏ ప్రభుత్వం(2001-2004)లో నితీశ్ కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.తొలిసారి ముఖ్యమంత్రిగా మార్చి 2000లో నితీశ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. 324 మంది సభ్యులున్న అసెంబ్లీలో అప్పుడు ఎన్‌డీఏకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు లాలూ చేతిలో 159 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిద్దరికీ సరిపడా ఆధిక్యం (163) దక్కలేదు. అయితే, బల పరీక్షకు ముందే నితీశ్ రాజీనామా చేశారు. ఏడు రోజులపాటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.
నితీశ్ పూర్తిస్థాయిలో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 2005లోనే. ఆ తర్వాతి ఎన్నిక (2010)ల్లోనూ ఆయనే విజయం సాధించారు.అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడంతో నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేశారు. ఆ సమయంలో ఎన్‌డీఏ నుంచి వేరుపడి జేడీయూ విడిగా పోటీచేసింది. నితీశ్ రాజీనామా అనంతరం జీతన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.2015 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నితీశ్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని ఘన విజయం సాధించారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు వెలుగుచూడటంతో మహా కూటమి బీటలు వారింది.
దీంతో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేశారు. అయితే, వెంటనే ఎన్‌డీఏతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లోనూ ఎన్‌డీఏతో కలిసే నితీశ్ బరిలోకి దిగారు.ఒకప్పుడు… మట్టిలోనైనా కలుస్తాను గానీ బీజేపీతో కలవను అని నితీశ్ అన్నారు. అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనని విశ్లేషకులు చెబుతుంటారు.నితీశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన పార్టీకి తక్కువ సీట్లు ఉండటంతో ఆయనపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరిగింది. రెండేళ్లపాటు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్ మళ్లీ యూ టర్న్ తీసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2022 ఆగస్టులో నితీశ్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ను నియమించారు.ఈసారి బీజేపీ పట్ల నితీశ్ కఠిన వైఖరి అవలంబించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు.”చావడానికైనా సరే గానీ, వారితో కలవడాన్ని ఎప్పటికీ మేం ఒప్పుకోం” అని నితీశ్ అన్నారు.2023 జనవరి 30న మీడియాతో మాట్లాడుతూ నితీశ్ ఈ మాటలు అన్నారు. ఇలా అని ఏడాది కూడా తిరగలేదు. ఆ తర్వాత, నితీశ్ మళ్లీ బీజేపీతో జత కట్టారు.
”2005-10 మధ్యలో ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాల కారణంగా ఆడపిల్లలకు పోషకాహారం, పాఠశాల విద్య వంటివి అందాయి. లాలూ ప్రసాద్ పాలనలో జరిగిన అవినీతి నితీశ్ పాలనలో ఆగిపోయింది. మాటలు చెప్పేవారికి 15 సంవత్సరాలు అధికారం ఇస్తే, కష్టపడి పనిచేసేవారికి ఐదేళ్లే ఇస్తారా అంటూ 2010లో నీతీశ్ తన ఎన్నికల ప్రసంగాల్లో పదే పదే చెప్పేవారు” అని బిహార్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మణికాంత్ ఠాకూర్ గతంలో బీబీసీతో అన్నారు.
కానీ, ఆ తర్వాత నితీశ్ ప్రభుత్వంపై కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయని ఆయన అన్నారు.
”2005 నుంచి 2010 మధ్య నితీశ్ పాలన చాలా మెరుగ్గా ఉండేది. మహిళలు, బాలికల కోసం ఆయన చాలా పథకాలు ప్రవేశపెట్టారు. జంగిల్ రాజ్‌ను దాదాపుగా ఆయన తుడిచిపెట్టేశారు. ఆ తర్వాత నితీశ్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి ” మణికాంత్ ఠాకుర్ వ్యాఖ్యానించారు.మతపరమైన ఇమేజ్‌కు దూరంగా ఉండే నీతీశ్.. 2019 ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అలానే 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ.. నితీశ్ కోసం ఓట్లడిగారు.జేడీయూకు సంస్థాగత నిర్మాణం లేదు. బూత్ స్థాయి కార్యకర్తలు లేరు. కానీ నితీశ్ రాజకీయ చతురత, సామర్థ్యాలే ఓటు బ్యాంకు రాజకీయాల ఆధారంగా నడిచే పార్టీలను ఎన్నికల క్షేత్రంలో వెనక్కు నెట్టాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
నితీశ్ కుమార్ రాజకీయం చాలామందికంటే భిన్నంగా ఉంటుందని అంటారు. తన పొలిటికల్ కెరీర్ లో తొలుత మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలిచిన ఆయన.. అనంతరం శాసనమండలి నుంచి ఎన్నికై ముఖ్యమంత్రి అవ్వడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా… తొలుత 2000 సంవత్సరం మార్చి నెలలో ఒకసారి వారం రోజులు పాటు బీహార్ సీఎంగా పనిచేశారు. అనంతరం 2004 ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే ఓటమి పాలవడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నితీశ్ – వాజ్ పేయి జోడి, బీహార్ లో ఎన్డీయేను అధికారంలోకి తెచ్చింది. దీంతో.. నితీశ్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
నాటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు! ఫలితంగా ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచినా.. 20 ఏళ్లుగా సీఎం కుర్చీపై కొనసాగారు నితీశ్ కుమార్. ఈ దఫా కూడా ఆయనను సీఎం కుర్చీ వరిస్తే… అది మరో చరిత్రగా మారబోతోంది!1985లో ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు నితీశ్ కుమార్. ఈ క్రమంలో 1989, 1991, 1996, 1998, 1999, 2004లో వరుసగా ఎంపీగా గెలిచారు. ఇలా 15 ఏళ్ల వ్యవధిలో ఆరు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని, గెలిచి తన సత్తా చాటారు. ఈ క్రమంలోనే.. ఎన్డీయే సర్కార్ లో రైల్వే, వ్యవసాయ శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

















