నిన్న మొన్నటి వరకు కూటమి పార్టీల మధ్య ఐక్యత ఎలా ఉన్నప్పటికీ ఇటీవల గత వారం నుంచి పార్టీలలో నాయకుల మధ్య కలివిడి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ఎంపీలకు సంబంధించి చేసిన కీలక సూచనల అనంతరం ఈ కలివిడి గ్రౌండ్ లెవెల్లో మరింత ఎక్కువగా కనిపి స్తోంది అన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుపరిపాలన పైరుతో మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయి శతజయంతి ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బిజెపి ర్యాలీలు నిర్వహిస్తోంది. వాజ్ పేయికి సంబంధించిన పరిపాలనను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఏపీలో కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కలిసి పాల్గొంటున్నారు. చంద్రబాబు సైతం టిడిపి శ్రేణులకు ఇదే విషయం చెప్పారు. కలివిడిగా ఉండాలని, వచ్చే ఎన్నికల నాటికి కూడా కూటమి కొనసాగుతుందని, ఇప్పటి నుంచి నాయకులు అలెర్ట్ అవ్వాలని చెప్పడంతో క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులతో కలిసి సుపరిపాలన యాత్రలు చేస్తున్నారు.
వాజ్ పేయి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో టిడిపి నాయకులు పాల్గొంటున్నారు. మంత్రుల నుంచి నాయకుల దాకా ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు అందరూ చేయి చేయి కలిపి కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఇదే కలివిడి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కాదు రాబోయే మరో రెండు మూడు ఎన్నికల వరకు కూడా ప్రభుత్వం బలంగానే ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచన. మొత్తానికి ఇప్పటికైతే గ్రౌండ్ లెవెల్లో మూడు పార్టీల నాయకులు కలిసి పనిచేస్తున్నది వాస్తవం.
నిజానికి కలివిడి విషయంపై చంద్రబాబు.. ఆది నుంచి కూడా నాయకులకు చెబుతున్నారు. అందరూ కలిసిఉండాలని కోరుతున్నారు. కానీ, ఇతరత్రా కారణాలతో ఈ కలివిడి తగ్గింది. అయితే.. ఇటీవల ప్రధాని మోడీ కూడా కూటమి బలోపేతంపై చర్చించడం.. వైసీపీని టార్గెట్ చేయాలని చెప్పడం.. కలివిడిగా ముందుకు సాగాలని అనడంతో నాయకుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇది.. ప్రస్తుతం గ్రౌండ్‌లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ కలివిడి మరింత బలోపేతం అయితే.. బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి.


















