మంగళగిరి 2019 దాకా పెద్దగా రాజకీయంగా ప్రాచుర్యంలో లేని నియోజకవర్గం. గుంటూరు జిల్లా వంటి రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంగా దశాబ్దాల క్రితమే ఏర్పాటు అయినా పొలిటికల్ సౌండ్ అంటూ ఏమీ లేకుండా ఉంటూ వచ్చింది. ఎపుడైతే నారా లోకేష్ 2019లో మంత్రిగా ఉంటూ పోటీకి దిగారో నాటి నుంచి మంగళగిరి స్టేట్ వైడ్ గా డిస్కషన్ లోకి వచ్చింది.
ఇక ఆ ఎన్నికల్లో లోకేష్ ఓటమి పాలు అయ్యారు. గెలిస్తే ఏమో కానీ ఓటమే ఆయనలో పట్టుదలను పెంచేసింది. ఓడినా అయిదేళ్ల పాటు ఆయన అక్కడే ఉన్నారు. తన వంతుగా అభివృద్ధిని చూపిస్తూ ఒక విలక్షణతను చాటుకున్నారు తాను గెలిస్తే ఏమి చేయగలనో కూడా జనాలకు చెప్పి కొత్త ఆశలను చిగురింపచేశారు.
ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ పోటీ చేసి ఏపీలోనే టాప్ త్రీ మెజారిటీని సాధించారు ఏకంగా 90 వేల పై చిలుకు వచ్చింది. దీంతో పాటు లోకేష్ మంత్రి అయ్యారు. అయినా తన సొంత నియోజకవర్గాన్ని ఆయన ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. తాను ఎంత బిజీగా ఉన్నా ప్రజా దర్బార్ లను నిర్వహిస్తూ వస్తున్నారు. అదే విధంగా తాను అందుబాటులో లేకపోతే తన తరఫున కీలక నాయకులను రంగంలోకి దింపి మరీ ఇంటింటికీ తిప్పుతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి టీడీపీ సీనియర్ నేతలు ముఖ్యులు అంతా ఇపుడు నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు. ప్రతీ ఇంటికీ వెళ్ళి మరీ వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటున్నారు.
వాటికి పరిష్కారాలను చూపిస్తున్నారు. మరో వైపు చూస్తే ఏడాది కాలంలోనే మంత్రిగా లోకేష్ ఉంటూ మంగళగిరి రూపు రేఖలు బాగా మార్చేశారు అని అంటున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి బాగా కనిపిస్తోంది అని జనాలే చెబుతున్నారు. నియోజకవర్గంలోని దిగువ ప్రాంతాలకు కూడా రోడ్లు వచ్చేశాయి. దాంతో జనాలు హుషార్ గా ఉన్నారు. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ ని కూడా అందిస్తున్నారు. ఇక ఇంటింటికీ తాగు నీరు అన్న లక్ష్యంతో మంత్రి లోకేష్ పనిచేస్తున్నారు. అది ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతోంది. ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి. ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.
అదే విధంగా చూస్తే కనుక మంగళగిరి నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. వారికి కూడా బాగా ప్రభుత్వం పరంగా ఆదరణ దక్కుతోంది అని అంటున్నారు. ఈ వర్గం ఇపుడు సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. అలాగే చేతి వృత్తుల వారికి కూడా తగిన న్యాయం జరుగుతోంది అని చెబుతున్నారు ఒక వైపు అభివృద్ధి మరో వైపు కీలక వర్గాలకు న్యాయం చేస్తూ ఒక ఎమ్మెల్యేగా లోకేష్ తన పనితీరుతో బాగానే ఆకట్టుకున్నారు అని అంటున్నారు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. దాంతో ఏపీలోనే మంగళగిరి రోల్ మోడల్ గా నిలుస్తుంది అని అంటున్నారు. లోకేష్ సైతం తన సొంత నియోజకవర్గాన్ని ఒక అద్భుతంగా తయారు చేసి తన సత్తాను చాటుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మంగళగిరిలో బాగానే మార్పు వచ్చిందని అంటున్నారు. న్యూ లుక్ తో జనంలో టాక్ వేరే లెవెల్ అని అంటున్నారు.