ఏపీ సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్. అంతే కాదు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇలా రాజకీయంగా ప్రభుత్వ పరంగా ఫుల్ బిజీగా తండ్రీ కొడుకులు ఇద్దరూ ఉంటారు. మరి తండ్రీ కొడుకులు ఒకే ఇంట్లో ఉంటారు కదా ఎలా ఉంటారు ఏమేమి మాట్లాడుకుంటారు అన్న చర్చ అయితే ఉంది. ఆ విధంగా అంతా ఆలోచిస్తారు కూడా. అయితే ఈ ఆసక్తికి ఉత్కంఠకు లోకేష్ తెర దించేసారు.
ఆయన ఒక జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చంద్రబాబు బయట మాత్రమే రాజకీయాలు మాట్లాడుకుంటామని చెప్పారు. ఒక్కసారి ఇంటికి చేరాక నో పాలిటిక్స్ అని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా ఇంట్లో రాజకీయాల ప్రస్తావన అసలు రానీయరు అన్నారు. ఇది తాము పెట్టుకున్న ఒక నియమం అన్నారు.
బయటకు వస్తే ఇంటి విషయాలు మాట్లాడుకోరాదు అన్నది కూడా మరో నియమం అన్నారు. బయట ఆయన తన బాస్ అని సీఎం అని తాను ఆయన మంత్రిని అని లోకేష్ చెప్పారు. ఆ విధంగానే చంద్రబాబుని గౌరవిస్తానని చెప్పారు. అయితే ఇంటికి వెళ్తే మాత్రం తనకు చంద్రబాబు బాస్ కాదని తనకు తండ్రి అని అన్నారు. అందుకే నాన్నా అని ఆయనని పిలుస్తాను అన్నారు. తాను ఇంట్లో తండ్రితో కలసి ఇతర విషయాలను చర్చిస్తాను రాజకీయాలకు సంబంధం లేని ఏ విషయం మీద అయినా మాట్లాడుకుంటామని అన్నారు.
ఇక తమ కుటుంబం రాజకీయాలను వ్యాపారాలను వ్యక్తిగత విషయాలను మిళితం చేయడానికి వ్యతిరేకమని లోకేష్ చెప్పారు. తాను అన్నీ ఆలోచించుకునే రాజకీయ రంగ ప్రవేశం చేశాను అన్నారు. రాజకీయాల్లోకి రాకముందు తమ కుటుంబ వ్యాపారాలను తాను అయిదేళ్ళ పాటు చూశాను అని లోకేష్ చెప్పారు. ఇదిలా ఉంటే తన తండ్రి చంద్రబాబుని అరెస్టు చేసి జైలులో పెట్టారని అది తన జీవితంలో అత్యంత బాధించే సంఘటనగా ఆయన చెప్పారు. ఆ రోజు తాను ఏడ్చేశాను అన్నారు. రాజమండ్రిలో తన తండ్రి జైలులో ఉండడం చూసి తన గుండె తరుక్కుపోయింది అని లోకేష్ చెప్పారు.
ఇదిలా ఉంటే తన జీవితంలో అతి ముఖ్య పాత్ర తన తల్లి భువనేశ్వరి పోషించారు అని లోకేష్ చెప్పారు. తన పట్ల తన తల్లి అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించింది అన్నారు నా ఎదుగుదల కోసం అమ్మ ఎన్నో త్యాగాలను చేసింది అని లోకేష్ గుర్తు చేసుకున్నారు. తన చదువు కానీ తన కెరీర్ కానీ ఇంర అంశాలలో కానీ అమ్మ మారదర్శకత్వం చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. మొత్తానికి లోకేష్ తన కుటుంబం గురించి ఆసక్తికరమైన అంశాలనే చాలా చెప్పారు.