ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంపద ఒక్కరోజే రూ.170 కోట్ల మేర పెరిగింది. నారా కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవడంతో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ పేరిట ఉన్న షేర్లు బాగా లాభపడ్డాయి. దీంతో వారి సంపద ఒక్కరోజులోనే భారీగా పెరిగింది. గురువారం మార్కెట్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (FMCG) రంగంలో ఉన్న కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి. ప్రధానంగా హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్స్ ఆకాశమే హద్దుగా పైకి ఎగబాకటంతో ఇన్వెస్టర్లు మంచి లాభాలను ఆర్జించారు.
దేశీయంగా స్టాక్ మార్కెట్ గురువారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో మంచి లాభాలు నమోదు చేసినప్పటికీ మధ్యాహ్నం మాత్రం వెనక్కి మళ్లాయి. అయితే డెయిరీ సెక్టార్ లో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం 10 శాతానికి పైగా లాభాలు నమోదు చేసి రికార్డు స్రుష్టించింది. దీంతో ఇన్వెస్టర్లు, ప్రమోటర్లకు కాసుల పంట పండిందని అంటున్నారు. స్టాక్ మార్కెట్ లో కొన్ని స్టాక్స్ ఊహించని రీతిలో పెరుగుతాయని చెబుతుంటారు. దీనికి హెరిటేజ్ స్టాక్స్ నిదర్శనంగా చూపుతున్నారు. గత సెషన్లో రూ.488.10 వద్ద ముగిసిన హెరిటేజ్ షేర్లు గురువారం మార్కెట్ ప్రారంభంతోనే 2 శాతం లాభంతో రూ.498.65 వద్ద ఓపెన్ అయింది. ఇక అక్కడి నుంచి దూసుకెళ్లింది.
ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 10 శాతానికి పైగా పెరిగి రూ.540క వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ స్టాక్స్ ఆకస్మికంగా ఇంతలా పెరగడానికి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఏర్పడటమే కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది స్టాక్ మార్కెట్లో ఉపయోగించే ొక టెక్నికల్ టర్మ్. ఇది ధర పెరుగుదలకు సంకేతమని చెబుతుంటారు. దీనికి అర్థం ఏంటంటే కప్ మాదిరిగా ధర ముందుగా పడిపోతుంది. ఒక స్టేజ్ లో ఆగిపోయి మళ్లీ భారీగా పెరుగుతుందని వివరిస్తున్నారు. ఇక్కడ పాత రెసిస్టెన్స్ స్థాయిని దాటి వెళ్తే బ్రేకవుట్ అని చెబుతుంటారు. ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ లో అదే సంకేతాలు కనిపించాయని నెటిజెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ లో ప్రమోటర్ల వాటానే 30 శాతానికి పైగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కంపెనీని స్థాపించినా, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి వాటాలు లేవు. హెరిటేజ్ తో వ్యక్తిగతంగా ఆయనకు సంబంధం లేదు. కానీ, ఆయన సతీమణి నారా భువనేశ్వరి అధిక వాటాతో కంపెనీకి వైస్ చైర్ పర్సన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. వాటాల విషయానికి వస్తే భువనేశ్వరి, బ్రాహ్మణితోపాటు మంత్రి లోకేశ్, ఆయన కుమారుడు దేవాన్ష్ కు వాటాలు ఉన్నాయి.
గురువారం పెరిగిన స్టాక్స్ వల్ల కంపెనీలో భువనేశ్వరికి ఉన్న 2 కోట్ల 26 లక్షల 11 వేల 525 షేర్లకు దాదాపు రూ.117 కోట్ల సంపద పెరిగినట్లు లెక్కిస్తున్నారు. అదేవిధంగా బ్రాహ్మణికి 4 లక్షల 30 వేల 952 షేర్లు ఉండగా, గరిష్ట స్థాయి వద్ద ఆమెకు రూ.2.23 కోట్ల మేర లాభం వచ్చినట్లు చెబుతున్నారు. అదేవిధంగా మంత్రి లోకేశ్ కు హెరిటేజ్ లో దాదాపు కోటి వరకు షేర్లు ఉన్నాయి. ఆయనకు రూ.52 కోట్ల మేర లాభం వచ్చినట్లు లెక్కగడుతున్నారు. ఇక దేవాన్ష్ కు కంపెనీలో 56 వేల షేర్లు ఉండగా, రూ.29 లక్షల లాభం వచ్చింది. ఇలా మొత్తం చంద్రబాబు కుటుంబంలో నలుగురికి కలిపి దాదాపు రూ.170 కోట్ల మేర ఆదాయం పెరిగిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు