టిడిపి సీనియర్ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయం దక్కించుకున్నారు. 2019లో భారీ ఎత్తున వైసిపి ప్రభావం కనిపించినప్పటికీ ఆయన హిందూపురంలో విజయం దక్కించుకుని పార్టీని నిలబెట్టారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన కీలక విషయం ఆసక్తిగా మారింది. తాజాగా బాలయ్య తన సొంత నియోజకవర్గంలో గత నాలుగు రోజుల నుంచి పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన అభిమానులతో పాటు పార్టీ నాయకులు నుంచి కూడా బాలయ్య కు మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ తెరమీదకు వచ్చింది. 40 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చాలామంది నాయకులు ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే ఏం జరుగుతుంది? అనే విషయం టిడిపిలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. వాస్తవానికి బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. చంద్రబాబు తలుచుకుంటే ఇవ్వచ్చు. కానీ ఒకే కుటుంబం నుంచి ఇంతమందికి పదవులు ఇవ్వడం సరికాదన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. పైగా సినీ రంగంలో ఇప్పుడు బాలయ్య ప్రస్థానం జోరుగా సాగుతోంది. చేతిలో నాలుగైదు సినిమాలు కూడా ఉన్నాయని సమాచారం. మంత్రి పదవి అంటే లేనిపోని విమర్శలు తెచ్చుకోవడం తప్ప మరొకటి కాదన్నది చంద్రబాబు ఆలోచన. పైగా బాలకృష్ణకు కూడా మంత్రి పదవిపై పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు.
ఎందుకంటే ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా సీఎం చంద్రబాబు స్వయంగా వియ్యంకుడు. ఆయన అల్లుడే మంత్రిగా ఉన్నారు. పదవులతో ఆయనకు వచ్చేది కూడా ఏమీ ఉండదు. బాలయ్యకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా అభిమానులు పార్టీ కార్యకర్తలు మాత్రం బలంగా ఆయనను మంత్రిగా చూడాలని కోరుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయంలో టిడిపిలో ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. ఆయన, ఇప్పటికే దూకుడుగా ఉంటారని మంత్రి పదవి ఇస్తే మరింత దూకుడు పెంచుతారని ఒక నాయకుడు అంతర్గతంగా వ్యాఖ్యానించారు. అయితే బాలయ్య వ్యక్తిగత స్వభావమే అటువంటిది కాబట్టి ఆయనను పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నది మిగిలిన వారి మాట. ఏదేమైనా ఇది కేవలం చర్చకు మాత్రమే పరిమితం. భవిష్యత్తులో అయినా ఇప్పుడైనా బాలయ్యకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ అది సాకారం కావడం కష్టం అన్నది సీనియర్ నాయకులు చెబుతున్న మాట.