మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగా ఎమ్మెల్సీ కూడా అయిన నాగబాబు రాజకీయ భవితవ్యం ఏమిటి అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వాస్తవానికి చూస్తే ఈపాటికే నాగబాబు రాష్ట్ర మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అయితే ఉన్న ఒకే ఒక బెర్త్ కోసం మార్పులు చేయడం కంటే కీలక మార్పులు చేస్తే కనుక అది ప్రయోజనకరంగా ఉంటుందని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు.
దాంతో మంత్రి పదవి నాగబాబుకు నానాటికీ ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రులకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ప్రచారం సాగింది. కొత్త వారు వస్తారు అని అల్టిమేట్ స్టేట్మెంట్ ఇచ్చేశారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి మంత్రివర్గంలో భారీ మార్పులు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మంత్రి వర్గాన్ని ఒకసారి కదిపితే కనుక తొలి బెర్త్ దక్కేది నాగబాబుకే అని అంటున్నారు. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఒకటి ఉంది అని అంటున్నారు. అదేంటి అంటే మంత్రివర్గంలోకి నాగబాబుని కాకుండా బీజేపీ మంత్రిని మరొకరిని ఎకామిడేట్ చేయాలని కేంద్రం నుంచి ఒత్తిడి వస్తోందిట. దానికి బదులుగా ఏపీ నుంచి మరొకరిని చాన్స్ ఇస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారట. అలా కేంద్ర మంత్రివర్గంలోకి ఏపీ నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నారని అంటున్నారు. దాంతో ఇపుడు ఆ పదవి కోసం టీడీపీ జనసేనలో పోటీ నడుస్తోందా అన్న ప్రచారం సాగుతోంది..
తన సోదరుడు నాగబాబుని రాష్ట్రంలో కంటే కేంద్రంలో మంత్రిగా చేస్తే పదవుల విషయంలో సమీకరణలు చక్కగా సరిపోతాయని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ఒకే కుటుంబం ఒకే మంత్రివర్గంలో ఉన్నారు అన్న విమర్శలకు తావు ఇవ్వకుండా ఉంటుందని ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. మరో వైపు టీడీపీ నుంచి అయితే మరో విధంగా ప్రచారం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రెండు కేంద్ర మంత్రి పదవులు టీడీపీకి కేంద్రంలో దక్కాయి. వాటిలో ఒకదాన్ని ఉత్తరాంధ్రకు బీసీ కోటాలో, అలాగే కోస్తాలో ఓసీ కోటాలో మరొకరికీ ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. మూడవ మంత్రి పదవి తీసుకుని రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తే ప్రాంతీయ సమీకరణలు సరిపోతాయని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇక ఈ పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఉమ్మడి కర్నూల్, అనంతపురం లేదా చిత్తూరు జిల్లాలకు చెందిన వారికి ఈ కేంద్ర మంత్రి పదవి విషయంలో చాన్స్ ఉంటుందని చెబుతున్నారు ముందే మాట ఇచ్చినట్లుగా నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలోనే తీసుకుంటే అంతా బాగానే ఉంటుందని యోచిస్తున్నారని అంటున్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ అయితే జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వాలని భావిస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, బీజేపీల నుంచి ఏపీలో ప్రాతినిధ్యం ఉంది. జనసేనను కూడా కలుపుకుంటే కూటమి పార్టీలకు సమ న్యాయం చేసినట్లు అవుతుందని కేంద్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.
అయితే నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి మండలిలో చోటు కల్పించాలంటే కచ్చితంగా మరో ఏడాది పాటు అయినా ఆగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 2026లో రాజ్యసభ సభ్యులు నలుగురు ఏపీ నుంచి ఖాళీ అవుతారు. ఆ సీట్లు అన్నీ టీడీపీ కూటమికే దక్కుతాయి కాబట్టి అందులో ఒకటి నాగబాబుకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి వర్షాకాల సమావేశాల తరువాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అని అంటున్నారు. నాగబాబుకు ఇవ్వాలంటే ఇపుడైతే కుదిరేది కాదని అంటున్నారు. దాంతో నాగబాబు ఏపీ మంత్రిమండలిలోనే ఉంటారా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా నాగబాబు మంత్రి అవడం ఖాయం. అది కేంద్రమా రాష్ట్రమా అన్నదే తేలాల్సి ఉందని అంటున్నారు.