అనూహ్య విషాద ఘటన ఒకటి ముంబయిలో చోటు చేసుకుంది. ట్యూషన్ కు వెళ్లే అంశంపై గొడవ పడిన పద్నాలుగేళ్ల బాలుడు ఇంటి నుంచి బయటకు వచ్చి.. 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. వ్యక్తిగత గోప్యతలో భాగంగా సదరు మైనర్ తల్లి వివరాల్ని వెల్లడించటం లేదు.అయితే.. ఆమె ఎవరో కాదని.. ప్రముఖ టీవీ నటిగా చెబుతున్నారు. పేరును మాత్రం వెల్లడించటం లేదు. భర్తతో విడిపోయి కొడుకుతో కలిసి ఉంటున్న ఆమె.. తాజాగా ట్యూషన్ కు వెళ్లే అంశంపై తల్లి.. కొడుకులు ఇద్దరు వాదన చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ముంబయిలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరేజ్ అపార్టుమెంట్ లో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా ఈ ఉదంతం బయటకు వచ్చింది.
ట్యూషన్ కు వెళ్లేందుకు కొడుక్కి సుతారం ఇష్టం లేదని.. కానీ.. సదరు నటి మాత్రం కొడుకును ట్యూషన్ కు వెళ్లాల్సిందేనంటూ గట్టిగా చెప్పటం.. ఇరువురి మధ్య చోటు చేసుకున్న వాదనలో సదరు బాలుడు 57వ అంతస్థు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. బాలుడి సూసైడ్ అటెంప్టు ను గుర్తించిన పొరుగున ఉన్న ప్లాట్ లోని వ్యక్తి సదరు నటికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని చెబుతున్నారు. సదరు టీవీ నటికి బాలుడు ఒక్కరే సంతానంగా చెబుతున్నారు. పలు హిందీ.. గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ నటిగా పేరుంది. చదువులో ఒత్తిడే ఆత్మహత్యకు పురిగొల్పిందా? అన్న అంశంపై పోలీసులు విచారిస్తున్నారు ఆత్మహత్య చేసుకున్న బాలుడి తల్లి.. స్కూల్ టీచర్లు.. సదరు కుటుంబానికి సన్నిహితంగా ఉండే వారిని విచారించి.. బాలుడి ఒత్తిడికి కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు.