వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. వివరాలు… ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరోవైపు ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై బుధవారం వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ… మిథున్ రెడ్డి పార్లమెంటులో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారని, సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందని చెప్పారు
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మధ్యంతర బెయిలుపై రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఆదివారం ఉదయాన్నే ఆయన జైలు నుంచి బయటకు రాగా, నేరుగా హైదరాబాద్ వెళ్లినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా సాయంత్రం నుంచి వైసీపీకి చెందిన ప్రముఖ నేతలు అంతా ఎంపీ మిథున్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. మద్యం కేసులో జులై 19న అరెస్టు అయిన మిథున్ రెడ్డికి రెండు రోజుల క్రితం మధ్యంతర బెయిలు మంజూరైంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం ఆయన బెయిలు ఇవ్వగా, ఈ నెల 11న తిరిగి జైలులో లొంగిపోవాల్సివుంది.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డితో పలువురు వైసీపీ నేతలు భేటీ అయ్యారు. ఎంపీని పరామర్శించి, ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అయితే సుమారు 50 రోజుల పాటు జైలులో ఉండి వచ్చిన మిథున్ రెడ్డి ముఖంలో ఎలాంటి అలసట, విసుగు లేకపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం 53 రోజులు జైలు జీవితాన్ని అనుభవించి వచ్చారు. అప్పట్లో ఆయన ముఖంలో స్పష్టమైన మార్పు కనిపించింది. ముఖం బాగా పీకిపోయినట్లు అనిపించింది. కానీ, మిథున్ రెడ్డి ముఖంలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని చెబుతున్నారు. 50 రోజుల క్రితం ఆయన జైలుకు వెళ్లినప్పుడు ఎంత ఫ్రెష్ గా కనిపించారో, ఇప్పుడు అదేవిధంగా ఉన్నారని అంటున్నారు.
యువకుడైన మిథున్ రెడ్డి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జైలులో రిమాండు ఖైదీగా ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే 50 రోజులు జైలులో ఉన్నప్పటికీ మిథున్ రెడ్డి ముఖ తేజస్సులో ఎలాంటి మార్పు కనిపించలేదని అంటున్నారు. జులై 19న అరెస్టు అయిన మిథున్ రెడ్డిని భద్రత కారణాల ద్రుష్ట్యా లిక్కర్ కేసు నిందితులు ఉన్న విజయవాడ జైలు కాకుండా, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు ప్రత్యేక గదితోపాటు కొన్ని ప్రత్యేక వసతులు సమకూర్చారు.
మూడు పూటలా ఇంటి భోజనం, మందులు, వ్యాయామం చేసుకునే వెసులుబాటు, మంచం, పరుపు, దిండు వంటివి సమకూర్చారు. ఇక అనధికారికంగా కూడా కొన్ని వసతులు కల్పించారని వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో మిథున్ రెడ్డి తన రిమాండు కాలాన్ని ఏ మాత్రం కష్టంగా భావించలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారానికి ఐదు రోజులు ములాఖత్ లు ఇవ్వడం వల్ల కూడా ఆయన ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిస్థితులు తెలుసుకునేవారని అంటున్నారు. ఇక ఆదివారం హైదరాబాద్ వచ్చిన మిథున్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 11వ తేదీ గురువారం రాజమండ్రి జైలులో లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు మిథున్ న్యాయవాదులు ఆయనకు రెగ్యులర్ బెయిలు కోసం కోర్టులో పోరాడుతున్నారు. 11వ తేదీలోగా దీనిపై సానుకూల తీర్పు వస్తే ఆయన మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు.