మైకు ముందుకు వచ్చి ఆదర్శాల్ని వల్లెవేయటం.. కలల్ని ఆవిష్కరించటం చాలామందే చేస్తుంటారు.రాజకీయ నాయకులైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకు భిన్నంగా కొందరు ప్రముఖులు తాము చెప్పిన మాటల మీద పని చేస్తున్నామన్న సంకేతాలు ఇవ్వటమే కాదు.. చేతల్లోనూ చేసి చూపిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఆ కోవకు చెందిన వారు. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక్క మాటకు భాషాభిమానులు మాత్రమే కాదు అమ్మభాషను అమితంగా ఆరాధించే వాళ్లు ‘వావ్’ అనేస్తున్నారు.
రేవంత్ తీరును అభినందిస్తున్నారు. మిగిలిన వారు సైతం ముఖ్యమంత్రి బాటలో పయనించాలని చెబుతున్నారు. అమ్మభాష మీద ఒకప్పటి తన శిష్యుడు ప్రదర్శిస్తున్న కమిట్ మెంట్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి.. ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూఅసలేం జరిగిందంటే.. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై సీఎం రేవంత్ జిల్లా కలెక్టర్లతోనూ.. మహిళా సమాఖ్యలతోనూ వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా తమ జిల్లాకు సంబంధించిన వివరాల్ని ఇన్ చార్జి కలెక్టర్ గరీమా ఇంగ్లిషులో వివరిస్తున్నారు. దీంతో.. కల్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్.. ‘తెలుగులో మాట్లాడండి. తెలుగు వచ్చు కదా. ఇక్కడ అన్ని జిల్లాల మహిళా సంఘాల మహిళలు ఉన్నారు. వారికి కూడా అర్థమవుతుంది. వీలైనంత మేర తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి’’ అంటూ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు అక్కడి వారినే కాదు.. ఆ వీడియో క్లిప్ చూసిన ఎంతో మంది తెలుగోళ్ల మనసుల్ని దోచుకున్నారు ముఖ్యమంత్రి.
ఈ తరహా వ్యాఖ్యలు ఇప్పటివరకు ఏ తెలుగు ముఖ్యమంత్రి చేయలేదన్న మాట వినిపిస్తోంది. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్.. ‘‘తెలుగు వస్తుంది సార్. కచ్ఛితంగా మాట్లాడుతా’’ అంటూ ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ విధానం.. ఇతర వివరాల్ని తెలుగులో వివరించారు. మధ్య మధ్యలో ఇంగ్లిషు పదాల్ని ఉపయోగించినా.. ఆమె తెలుగు మాట్లాడిన తీరు అందరిని ఆక్టుకుంది. మొత్తంగా తెలుగు భాష మీద ముఖ్యమంత్రి రేవంత్ కు ఉన్న కమిట్ మెంట్ ను ఈ ఉదంతం చాటి చెప్పినట్లైంది. తెలుగు ప్రాంతాలకు చెందిన ప్రముఖులు.. సెలబ్రిటీలు వీలైనంత వరకు తెలుగులో మాట్లాడేందుకు మక్కువ చూపించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.












