ఆవేశపరుడైన బలవంతుడి కంటే ఆలోచనపరుడైన బలహీనుడు కొట్టే దెబ్బ బలంగా ఉంటుంది. కండ బలం ఉంటే సరిపోదు. అంతకు మించిన బుద్ధిబలం ఉండాలి. బుద్ధి బలం ఉండాలే కానీ.. కండలతో పనేముంది? కండలు చూపించి.. బస్తీ మే సవాల్ అనేటోడ్ని బుద్దిబలంతో మట్టి కరిపించే ఉదంతాలెన్నో. ఇప్పడు ట్రంప్ వర్సెస్ మోడీ తీరు అలానే ఉందని చెప్పాలి. నిజమే.. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ ను ఏ మాత్రం పోల్చుకోలేం. ఆ మాటకు వస్తే. రెండు దేశాల మధ్య మధ్య దూరంతో అమెరికా కంటే భారత్ కు జరిగే నష్టమే ఎక్కువ. అంత మాత్రాన.. తనకున్న బలాన్ని అతిగా ప్రదర్శిస్తూ.. జులుం చేస్తూ.. నియంత్రించాలని చూడటమే తప్పు అవుతుంది.
పాతకాలంలో మనకో సామెత ఉండేది. పిల్లి అయినా సరే గదిలో పడేసి కొడితే.. అది పులి అవుతుందని. అమెరికాతో పోలిస్తే.. భారత్ ఆర్థికంగా బలహీనంగా ఉండొచ్చు. అంతమాత్రాన అడ్డగోలుగా వ్యవహరిస్తే అగ్రరాజ్యానికీ నష్టముంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగాల్సిందే. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు.
అలా అని.. ఆ బాధ్యతను ఒకట్రెండు దేశాలు మాత్రమే భరించటం తప్పే అవుతుంది. ప్రపంచ దేశాలన్ని కాకున్నా.. బలమైన దేశాలు కలిసి.. రెండు దేశాల్ని కూర్చోబెట్టుకొని సమస్యను సామరస్య వాతావరణంలో ఒక కొలిక్కి తీసుకురావాల్సన అవసరం ఉంది. అది మానేసి.. బెత్తం పట్టుకున్నట్లుగా అగ్రరాజ్యం అమెరికా తనకు తోచినట్లుగా ఒంటెద్దు పోకడలకు పోవటంలో అర్థం లేదు.
రష్యా దగ్గర ముడి చమురు కొంటున్న భారత్ ను నిలువరించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు.. వేస్తున్న అడుగుల్ని చూసినప్పుడు.. ఆయన దూకుడుకు అంతే దురుసుగా సమాధానం చెప్పకుండా మౌనాన్ని ఆశ్రయించారు భారత ప్రధాని నరేంద్రమోడీ. ఒకప్పటి తన మిత్రుడైన ట్రంప్.. తన స్నేహాన్ని వదిలేసి.. అమెరికా ప్రయోజనాల పేరుతో భారతదేశ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా తీసుకునే నిర్ణయాలపైనా మోడీ స్పందించింది లేదు. చివరకు దాయాది పాక్ తో జరిగిన యుద్దంలోనూ భారత్ ను చిన్నబుచ్చేలా ప్రకటన చేయటం తెలిసిందే. అప్పటికి మోడీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదనే చెప్పాలి.
కానీ.. జాగ్రత్తగా గమనించి చూస్తే.. గడిచిన రెండు మూడు రోజులుగా మారుతున్న పరిణామాలు కొట్టొచ్చినట్లుగా కనినిస్తున్నాయి. మొన్నటికి మొన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. తమ వస్తువుల్ని కొనాలని తాము ఏ దేశాన్ని బతిమిలాడుకోమని తేల్చేశారు. అమెరికా సుంకాల నిర్ణయానికి అగ్రరాజ్యం దిమ్మ తిరిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. తాజాగా రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ చేసిన ప్రకటన మరింత ఆసక్తికరంగా మారింది.
‘‘ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటాం. ఎక్కడ చౌకగా దొరికితే ఇండియన్ కంపెనీలు అక్కడే కొనుగోలు చేస్తాయి. దేశీయ ప్రయోజనాల్ని కాపాడుకోవటానికే ఢిల్లీ ప్రాధాన్యం ఇస్తుంది. భారత్ లోని 1.4 బిలియన్ ప్రజల ఇంధన భద్రత మా లక్ష్యం’’ అని తేల్చేయటం చూస్తే.. భారత్ మాటలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటికే చైనాలో పర్యటించేందుకు ప్రధాని మోడీ సిద్ధం కావటం.. షెడ్యూల్ ఖరారు కావటం తెలిసిందే. మోడీ పర్యటనకు సంబంధించి బీజింగ్ ఇప్పటికే సానుకూలంగా స్పందిస్తున్న వైనం తెలిసిందే.
ఇదంతా చూస్తే.. గడిచిన కొన్నాళ్లుగా ట్రంప్ వ్యవహరిస్తున్న వైఖరిపై ప్రదాని మోడీ ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతుంది. అలా అని.. ట్రంప్ మాదిరి బాధ్యతారాహిత్యంతో ప్రకటనలు చేయకుండా.. అన్ని అంశాలపై ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తే.. సానుకూల వాతావరణానికి సంబంధించిన గ్రౌండ్ ను మోడీ సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు.. చేసిన ప్రకటనలే చేశాం. ట్రంప్ మొదలెట్టిన ఆటలోకి మోడీ వచ్చింది లేదు. గడిచిన రెండు.. మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ట్రంప్ షోకు ఇంటర్వెల్ వేసి.. మోడీ తన షో షురూ చేసినట్లుగా అనిపించకమానదు. మొత్తంగా చూస్తే.. ట్రంప్ ఇప్పటివరకు మోడీలోని మిత్రుడ్నే చూశారని.. ఇప్పుడు మోడీలోని మరో కోణాన్ని ట్రంప్ చూడనున్నట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!