ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పదిహేను నెలలు అవుతోంది. ఈ మధ్య కాలమంతా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పూర్తి బిజీగా ఉన్నారు. ఆయన తన మంత్రిత్వ శాఖల మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అలాగే ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉండడంతో ఆ వైపుగానే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే పార్టీ పరంగా కూడా పటిష్టం చేసుకోవాలని భావిస్తూ విశాఖ వేదికగా సేనతో సేనాని అన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇది పూర్తిగా పార్టీ పరమైన కార్యక్రమంగా ఉంది. చివరి రోజున బహిరంగ సభకు మాత్రం ఇతర జనాలందరికీ అవకాశం ఉంటుంది అని అంటున్నారు.
ఇదిలా ఉండగా గురువారం నుంచి శనివారం దాకా మూడు రోజుల పాటు సాగే కార్యక్రమం కోసం పవన్ విశాఖ చేరుకున్నారు. ఆయన తొలి రోజు ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అది కూడా వన్ టూ వన్ గా నిర్వహించారు. ఇదిలా ఉంటే పవన్ ఆయన ఇద్దరు మంత్రులు కాకుండా జనసేనకు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 18 మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశం అయ్యారని చెబుతున్నారు.
ఇక ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏమి జరుగుతోంది అన్నది ఆయన వారి నుంచే వివరాలను అడిగి తెలుసుకున్నారు అని అంటున్నారు. అదే విధంగా జనసేన ఎమెల్యేలు పదవులు చేపట్టాక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమేని అభివృద్ధి పనులు తమ నియోజకవర్గాలలో చేపట్టారు అన్నది కూడా పవన్ వారిని అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. అంతే కాదు ఆయా నియోజకవర్గాలలో ఉన్న సమస్యలు ఏమిటి పార్టీ తరఫున ఇచ్చిన హామీలు ఏమిటి ఎంత వరకూ అవి సాకారం అయ్యాయి అన్న దాని మీద చర్చించారని అంటున్నారు.
ఇక పవన్ ఒక్కో ఎమ్మెల్యేకు అయిదు నుంచి పది నిమిషాల వ్యవధి ఇస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారని చెబుతున్నారు అలాగే వారిని కూడా ఆయన వివిధ విషయాల మీద ప్రశ్నించారని అంటున్నారు. ఇదిలా ఉంటే కొందరు ఎమ్మెల్యేల మీద మీడియాలో వస్తున్న ఆరోపణల మీద పవన్ ఈ వన్ టూ వన్ భేటీలో వివరణ కోరారు అని అంటున్నారు. అంతే కాదు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద పార్టీ పరంగా స్వయంగా చేయించిన సర్వే నివేదికలను పవన్ దగ్గర ఉంచుకుని మరీ ఆయా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు అని అంటున్నారు.
ఇక చూస్తే మంత్రులు మినహాయించి మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి పనితీరు మీద జనంతో మమేకం అయిన విధానం మీద అభివృద్ధి మీద నియోజకవర్గంలో ప్రజలు వారి గురించి మాట్లాడుకుంటున్న తీరు మీద అలాగే పార్టీని పటిష్టం చేసే విషయం మీద కార్యకర్తలతో కలసి ముందుకు సాగడం మీద ఇలా అనేక అంశాల మీద చేయించిన సర్వే రిపోర్టులు అయితే అధినేత వద్ద ఉన్నాయని అంటున్నారు. అలా ఆ సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ర్యాంక్ లు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు.
మరి సీక్రెట్ గా వారికి ర్యాంకులు ఇచ్చి పనితీరు మెరుగుపరచుకోవాలని చెబుతారా లేక అందరి ముందే ఇచ్చి వారి పనితీరు మీద పార్టీకి ఒక స్పష్టత ఇస్తారా అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే మూడు రోజుల పాటు విశాఖలోనే పవన్ ఉంటున్నారు కాబట్టి ఎపుడు ఈ ర్యాంకులు ఇస్తారు అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు. మరి జనసేన లో ఎవరు బెస్ట్ ఎవరు సూపర్ బెస్ట్ ఎవరు వెనకబడి ఉన్నారు అన్నది తెలుస్తుందా అన్నదే ఉత్కంఠగా ఉంది.