లిక్కర్ స్కాంలో విచారణకు వస్తున్నట్లు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారులకు సమాచారం పంపారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎంపీ కొద్దిసేపటి క్రితమే విజయవాడకు బయలు దేరారు. దీంతో విజయవాడలో ఏం జరగనుందన్న టెన్షన్ కనిపిస్తోంది. అయితే తనను అరెస్టు చేసేందుకు సిట్ కట్టుకథలు అల్లుతోందని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ వచ్చేముందు ఢిల్లీలో ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి ప్రభుత్వంపైనా, సిట్ దర్యాప్తుపైన సంచలన ఆరోపణలు చేశారు. తనను అరెస్టు చేయాలనే ఏకైక లక్ష్యంతో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చారని, మద్యం పాలసీ రూపకల్పనలో తన పాత్ర లేదని స్పష్టం చేశారు.
రాజకీయ ఒత్తిడితోనే తనపై లిక్కర్ కేసు నమోదు చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా, ఇలాంటి తప్పుడు ఆరోపణలతోనే తనను జైలులో పెట్టారని, అనంతరం ఆ కేసును కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. మద్యం కేసులో తన పాత్రపై ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. వైసీపీలో ముఖ్య నేతలను అరెస్టు చేయడమే టార్గెట్ గా కేసులు పెడుతున్నారని విమర్శించారు మిథున్ రెడ్డి. రాష్ట్రంలో కక్ష పూరిత రాజకీయాలకు మద్యం కేసు ఉదాహకరణగా మిథున్ రెడ్డి అభివర్ణించారు.
మద్యం కేసులో తనపాత్రపై ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్షాలు లేవు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. తాను భయపడే వ్యక్తిని అయితే రాజకీయాల్లోనే ఉండనని చెప్పారు. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసును ధైర్యంగా ఎదుర్కుంటానని తేల్చిచెప్పారు. తన ఫోన్లు ఇచ్చేస్తానని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. ముందుగా తనను అరెస్టు చేయాలని నిర్ణయించుకుని ఆ తర్వాత కట్టుకథ అల్లారని మిథున్ రెడ్డి ఆరోపించారు.
అధికారులను నయానో భయానో ఒప్పించి సిట్ తనకు అనుకూలంగా స్టేట్మెంట్లు తీసుకుంటోందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. సరైన ఆధారాలు లేకుండా నోటి మాటలతో ఇచ్చే స్టేట్మెంట్లు చెల్లవని మిథున్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎవరినైనా అరెస్టు చేయాలంటే ముందుగా ప్రభుత్వ అనుకూల మీడియాలో మాస్టర్ మైండ్ అని కట్టు కథ అల్లుతారని, గతంలో ఒకరిని మాస్టర్ మైండ్ అంటూ ఆరోపించి, ఇప్పుడు తన పేరు ప్రచారంలోకి తీసుకువచ్చారని అన్నారు మిథున్ రెడ్డి. స్కాం జరిగిందని చెబుతున్న రూ.3,200 కోట్లు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. స్కాం జరిగితే ఆ డబ్బును సీజ్ చేయాలి కదా? అంటూ సిట్ ను నిలదీశారు. మద్యం కేసు నుంచి తాను నిరపరాధిగా బయటపడతానని మిథున్ రెడ్డి థీమా వ్యక్తం చేశారు.