లోక్ సభలో వైసీపీ నాయకుడు, హ్యాట్రిక్ ఎంపీ అయిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఆ పార్టీలో కీలక నేత అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జగన్ కోటరీలో కూడా అతి ముఖ్యుడు అని చెప్పుకుంటారు. రాయలసీమ ప్రాంతంలో మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ తరఫున చక్రం తిప్పుతారు అని అంటారు. ఆయన తనయుడిగా రాజకీయ వారసుడిగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఉన్నారు. ఆయనకు మెల్లగా కీలక జిల్లాల వ్యవహారాలు జగన్ అప్పగిస్తున్నారు. అయితే ఆ మధ్య ఆయన అరెస్టు అయ్యారు. ఏకంగా 73 రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మిధున్ రెడ్డి బెయిల్ మీద సోమవారం రాత్రి విడుదల అయ్యారు. ఆయన మంగళవారం తన జైలు జీవితం గురించి తన మీద పెట్టిన కేసుల గురించి మీడియా ముందు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం మీద ఆయన నిప్పులే చెరిగారు. టీడీపీ ఎపుడు అధికారంలోకి వచ్చినా తననే టార్గెట్ చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తన మీద కేసుల వల్ల కూటమి పెద్దలకు పైశాచిక ఆనందం తప్ప ఒరిగేది ఏమీ లేదని కూడా కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే అనంతపురం నెల్లూరు జిల్లాలకు సంబంధించి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని రీజనల్ కో ఆర్డినేటర్ గా జగన్ నియమించారు. ఈ నియామకం తక్షణం వర్తిస్తుందని పార్టీ ఆఫీసు నుంచి ప్రకటన వెలువడింది. అనంతపురం నెల్లూరు జిల్లాలలో వైసీపీకి 2019లో మంచి మెజారిటీ వచ్చింది, అంతే కాదు ఫ్యాన్ స్పీడ్ జోరుగా సాగింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం అంతా రివర్స్ అయింది. నెల్లూరులో వైసీపీ ఒక్క సీటుని కూడా గెలుచుకోలేకపోయింది. అదే విధంగా అనంతపురంలోనూ జరిగింది. దాంతో ఈ రెండు జిల్లాల బాధ్యతలను మిధున్ రెడ్డికి జగన్ అప్పగించారు. అక్కడ ఫ్యాన్ కి రిపేర్లు చేయమని ఆయనకు ప్రత్యేకంగా పురమాయించారు.
మరో వైపు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో పార్టీ బాధ్యతలు చూసినా ఎపుడు అరెస్టు చేస్తారో అన్నది ఒక ప్రచారంగా ఉంటూ వచ్చింది చివరికి ఆ ప్రచారం నిజం అయింది. అలా అనుకున్నదే జరిగింది. రెండున్నర నెలల పాటు జైలు జీవితం చూసిన మిధున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చేశారు. రానున్న రోజులలో పార్టీ కోసం మరింత దూకుడుగా పనిచేస్తాను అని అంటున్నారు. ఇక మీదట ఆయన గురించి అరెస్టుల ప్రచారాలు కూడా ఏవీ ఉండవు కాబట్టి కూటమిని రెట్టింపు ఎనర్జీతో టార్గెట్ చేసి తీరుతారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ సైతం ఆయన రాక కోసం ఎదురు చూసినట్లుగా వచ్చీ రావడంతోనే కీలక జిల్లాలను అప్పగించారు అని అంటున్నారు.