లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు కల్పించిన ప్రత్యేక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేయాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది. జైలు మాన్యువల్ ప్రకారం కొన్ని సదుపాయాలు కల్పించలేమని కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా జైలులో రిమాండు ఖైదీగా ఉన్న నిందితుడికి ఇంటి భోజనం కూడా అనుమతించలేమని జైళ్ల శాఖ ఏసీబీ కేసులో పిటిషన్ వేసింది. ఈ పరిణామంతో పార్లమెంటు సభ్యుడికి కోర్టు కల్పించిన సౌకర్యాలపై అడ్డుపుల్లలు వేయడమేనంటూ వైసీపీ విమర్శిస్తోంది.
లిక్కర్ స్కాంలో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 వరకు ఆయనకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిందిగా ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. దీని ప్రకారం జైలులో వెస్ట్రన్ కమోడ్ తో కూడిన ప్రత్యేక గది కేటాయించడంతోపాటు అల్పాహారంతోపాటు మూడు పూటలా ఇంటి భోజనం, మినరల్ వాటర్ బాటిల్స్, వ్యక్తిగత బెడ్, దిండు, దుప్పటి, ఎయిర్ కూలర్, దినపత్రికలు, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, నోటు బుక్స్, పెన్నులు, ప్రొటీన్ పౌడర్, ఒక సహాయకుడు, న్యాయవాదులు, బంధువులతో వారానికి ఐదు మిలాఖత్ లు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
అయితే కోర్టు తీర్పుపై జైళ్ల శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జైలు మాన్యువల్ ప్రకారం సహాయకుడిని కేటాయించలేమని సూపరింటెండెంట్ ఇప్పటికే స్పష్టం చేశారు. మిథున్ రెడ్డికి అలాంటి సౌకర్యం కల్పిస్తే, జైలులో మిగిలిన ఖైదీలు కూడా సహాయకులను అడిగే అవకాశం ఉందని, ఇది ఆచరణ సాధ్యం కాదని సూపరింటెండెంట్ కోర్టుకు నివేదించారు. దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు ఇంటి భోజనం కూడా అనుమతించలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ వేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.