వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. మద్యం స్కాంలో ఏ4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో మాజీ సీఎం జగన్ సన్నిహితుడైన పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి భవితవ్యంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తమవుతున్నారు.
ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం సూచనతో హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆయనకు మరో ఆప్షన్ లేనట్లేనని అంటున్నారు. దీంతో మిథున్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ అయినట్లేనని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ గా పనిచేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేసినందున మిథున్ రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనకే హైకోర్టు మొగ్గు చూపింది. దీంతో మిథున్ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు మళ్లీ వెళ్లే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం రాజంపేట వైసీపీ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు, కొనుగోలు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆయన డైరెక్షన్ లోనే మిగిలిన నిందితులు నడుచుకున్నారని, ఏ డిస్టలరీకి మద్యం కొనుగోలు ఆర్డర్ ఇవ్వాలి? ఏ డిస్టలరీ నుంచి ఎంత కమీషన్ తీసుకోవాలి? ఎక్కడకు పంపాలి?
ఎవరికి అప్పగించాలి అన్నది మిథున్ రెడ్డి డిసైడ్ చేసేవారని సిట్ ఆరోపిస్తోంది. దీనిపై గతంలోనే రెండుసార్లు మిథున్ రెడ్డిని విచారించింది. అయితే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని, తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని కారణం చూపుతూ మిథున్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం కలగజేసుకుని మిథున్ రెడ్డి అరెస్టు కాకుండా రక్షణ కల్పించింది. గత ఏప్రిల్ నుంచి ఆయన అరెస్టు నుంచి రక్షణ పొందగా, గత నెలలో హైకోర్టులో ముందస్తు బెయిల్ వేసుకోవాలని సుప్రీం సూచించింది.
అంతేకాకుండా అరెస్టు కాకుండా కల్పించిన రక్షణను తొలగించింది. కానీ, మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీ బెయిల్ పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
దీంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమం అయిందని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీకి చెందిన పలువురు నేతలు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇందులో మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమనోహర్రెడ్డి, రాజ్ కేసిరెడ్డి వంటివారు ఉన్నారు.