తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మిస్ వరల్డ్ పోటీలను’ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలతో తీర్చి దిద్దుతుంది. పోటీలో పాల్గొనడానికి విచ్చేసిన అందగత్తెలందరికి తెలంగాణ విందు, వినోదాలను కూడా పరిచయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.ఇందులో భాగంగా నిన్న హైద్రాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబసమేతంగా ఈ మిస్ వరల్డ్ పోటీ దారులకు విందును అందించారు. అలాగే నాగార్జున సాగర్ వద్ద ఉన్న బుద్దవనాన్ని కూడా సందర్శించి వచ్చారు ప్రపంచ సుందరీమణులు. అలాగే హైదరాబాద్ ఛార్మినార్ లో సైతం తెలంగాణ సాంస్కృతిక కళలకు చెందిన వివిధ వస్తువులను షాపింగ్ చేసారు.
ఇక నేడు హన్మకొండ లో పర్యటించిన కంటిస్టెంట్స్ రామప్ప దేవాలయం, ప్రసిద్ధి చెందిన వరంగల్ వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట ను సందర్శించారు. దానితో పాటుగా హన్మకొండలోని ఓ హోటల్ లో అధికారులతో కలిసి సుందరీమణులంతా తెలంగాణ బ్రాండ్ గా చెప్పుకునే బతుకమ్మ ఆట ను కూడా ఆడి సందడి చేసారు.అయితే వీరంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ తెలంగాణ ప్రజలను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. రేవంత్ సర్కార్ ప్రత్యర్థులకు ఎటువంటి విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ వేదికగా జరుగుతున్నాయి. మే 7న ప్రారంభమైన ఈ పోటీలు మే 31 వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వం మే 10న గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించింది.మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 110 దేశాల నుంచి సుందరీమణులు హాజరయ్యారు.తెలంగాణ టూరిజం, హెరిటేజ్, సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఫ్లై ఓవర్లు, కూడళ్లలో ప్రత్యేక లైటింగ్, మిస్ వరల్డ్ పోటీలను సూచించేలా లోగోలు ఏర్పాటు చేశారు.
పోటీదారులను మే 12న బుద్ధవనం సందర్శనకు తీసుకెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. మే 13న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించారు. పోటీదారులు ఎక్కడికి వెళ్లినా, రెడ్ కార్పెట్ వేసి నడిపించడం, ట్రాఫిక్ నిలిపివేయడం, ఫుట్ పాత్‌లపై ఉండే చిన్నచిన్న దుకాణాలు మూసివేయించడంపై విమర్శలు వస్తున్నాయి.వేయి స్తంభాల గుడికి వెళ్లినప్పుడు వరంగల్ పట్టణంలోని ఆ గుడి ఉన్న రోడ్డులో దుకాణాలు మూసివేయించారు. రామప్ప టెంపుల్, చార్మినార్ వద్ద కూడా కొన్ని దుకాణాలు మూసివేయించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే, సాధారణ దుకాణాలు తెరిచే ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.మిస్ వరల్డ్ పోటీదారుల కోసం సాధారణ ప్రజలను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని ఎంపీ కడియం కావ్య తెలిపారు.
”సాధారణంగా వీఐపీ రాకపోకలు ఉన్నప్పుడు కాసేపు ట్రాఫిక్ నియంత్రిస్తారు. అంతే తప్ప సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఎక్కడా జరగలేదు.మిస్ వరల్డ్ పోటీలపై ప్రపంచం దృష్టి ఉంటుంది. భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అందుకే ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం” అని హైదరాబాద్‌కు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు.”మిస్ వరల్డ్ పోటీలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం ఉంది. అందుకే, ఏదైనా అనుకోని ఘటన జరగకుండా ముందు జాగ్రత్తగా రామప్ప టెంపుల్ రోడ్డులో కోతులు పట్టించాం, తేనె తుట్టెలు తొలగించాం” అని ములుగుకు చెందిన ఫారెస్ట్ అధికారి ఒకరు చెప్పారు.