హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈనెల 14వ తేదీన చారిత్రక ఓరుగల్లు కోటను, హన్మకొండలోని వేయి స్తంభాల గుడిని, ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాలలో ప్రపంచ సుందరీమణుల పర్యటన
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన పోటీదారులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తున్న క్రమంలో రేపు హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ, వరంగల్, ములుగు జిల్లాల కలెక్టర్లు పి ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, దివాకర టీఎస్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీరి పర్యటన ఏర్పాట్లను చేయించారు.
సర్వాంగ సుందరంగా ఓరుగల్లు కోట, వెయ్యి స్తంభాల ఆలయం,, రామప్ప ఆలయాల ముస్తాబు
వరంగల్ త్రి నగరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ములుగు జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హన్మకొండ, వరంగల్ లలో వివిధ శాఖల సమన్వయంతో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను, బందోబస్తును, సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాట్లను ఫ్లిక్ మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనలను చేస్తున్నారు .
రేపు సాయంత్రం 4.35నిమిషాలకు మిస్ వరల్డ్ పోటీదారులు 35 మంది హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కు చేరుకుని 5.45నిమిషాలకు వేయి స్తంభాల దేవాలయానికి వెళ్తారు. అక్కడినుండి 6.25 నిమిషాలకు వరంగల్ కోటను సందర్శిస్తారు అనంతరం7 గంటల 35 నిమిషాలకు హోటల్ కు తిరిగి చేరుకుని 9 గంటలకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. ఇక ఈ సందర్శనలో వీరికి చారిత్రక కట్టడాల విశేషాలను గైడ్స్ తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు.
ఇక 72వ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణులు 22మంది ఈనెల 14న ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు.14 న హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ములుగులోని హరిత హోటల్ కు చేరుకొని,4:30 కి సాంప్రదాయ వస్త్రాల్లో రామప్ప దేవాలయ దర్శనం చేసుకుంటారు.5 గంటలకు దేవాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. ఆపై తిరిగి రాత్రి హరిత హోటల్ కు చేరుకొని తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు.