*రైతుగా మారిన మంత్రి నిమ్మల రామానాయుడు*
*కాస్త విరామం దొరకడంతో పార పట్టిన మంత్రి నిమ్మల*
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు రైతుగా మారారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ, శాఖాపరమైన పనులు, పార్టీ బాధ్యతలతో రోజుకు 18 గంటల పాటు అహర్నిశలు కష్టపడే మంత్రి రామానాయుడు… కొద్దిపాటి తీరిక లభించినప్పుడల్లా తనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు.
క్రిస్మస్ సందర్భంగా లభించిన స్వల్ప సెలవును సద్వినియోగం చేసుకుని ఆయన తన సొంతూరు ఆగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లారు. ట్రాక్టర్‌తో దుక్కు దున్ని, గట్టు లంకలు వేస్తూ స్వయంగా వ్యవసాయ పనులు చేశారు. ఈ అనుభవం తనకు ఎంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించిందని మంత్రి తెలిపారు.
“ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా… తీరిక దొరికినప్పుడు ఒక గంటైనా, ఒక పూటైనా వ్యవసాయ పనులు చేస్తే రైతు కష్టం, వ్యవసాయ విలువ నిజంగా అర్థమవుతుంది” అని మంత్రి అభిప్రాయపడ్డారు. చిన్నప్పటి నుంచీ తండ్రి వద్ద నేర్చుకున్న వ్యవసాయ పనులను, అవకాశం దొరికిన ప్రతిసారి చేస్తూ… అన్నం పెట్టే అన్నదాత కృషిలో తానూ భాగస్వామిగా ఉండడం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిస్తుందని డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.









