*వచ్చే పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభం!*
*ప్రాజెక్టు పనుల పురోగతి పై సమీక్షా సమావేశం*
*జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు అధికారులకు దిశా నిర్దేశం*
ఆంధ్రుల జీవనాడి, రాష్ట్ర ప్రజలకు వరం అయిన పోలవరం ప్రాజెక్టును ముందుగా నిర్ణయించిన గడువు 2027 డిసెంబరు కన్నా ముందుగానే, అదే ఏడాది జరిగే పుష్కరాలు నాటికే పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులను, పురోగతిని ఆయన గురువారం క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పవిత్ర గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే విధంగా అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ ఏజెన్సీలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశానికి ముందు ప్రాజెక్టు పరిధిలోని గ్యాప్ -1 లో ప్రధాన డ్యామ్ రాక్ ఫిల్లింగ్ పనులు, గ్యాప్ -2 లో డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు, కుడి కాలువ అనుసంధానం పనుల్లో భాగంగా జంట సొరంగాల్లో జరుగుతున్న క్లిష్టమైన లైనింగ్ పనులను మంత్రి స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు చెప్పిన సమాధానాలకు.. గడువు ఆధారంగా జరుగుతున్న పనులకు పూర్తి సంతృప్తి చెందారు. వారిని మనస్ఫూర్తిగా అభినందించి 2027 డిసెంబరు కంటే ముందుగా పుష్కరాలకు పూర్తి చేస్తే ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళమవుతామని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ డయాఫ్రంవాల్ నేటికి 950 మీటర్లు నిర్మాణం జరిగి 75 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు. 2014-2019 హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన 72 శాతం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 17 నెలల కాలంలో పూర్తి చేసిన 12 శాతం పనులు కలుపుకొని నేటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 88 శాతం పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.పోలవరం పనులు జగన్ 5 ఏళ్లలో 2శాతం చేస్తే, నేడు మొదటి ఏడాదిలోనే 12శాతం చేసినట్లు ఆయన చెప్పారు. క్లిష్టమైన టన్నెల్స్ లైనింగ్ తో ఉన్న రైట్ కనెక్టివిటీస్ 82 శాతం, లెప్ట్ కనెక్టివిటీస్ 62 శాతం పనులు పూర్తి చేశామన్నారు.
బట్రస్ డ్యాం పూర్తి చేసి, వర్షా కాలం లో కూడా ప్రాజెక్టు పనులు ఆగకుండా వేగవంతం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.
18 నెలలు శ్రమించి నిర్మాణం చేసిన డయాఫ్రం వాల్ ను జగన్ ధ్వంసం చేస్తే , నేడు 900 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఫిబ్రవరి కల్లా కొత్త డయాఫ్రం వాల్ ను పూర్తి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఒక్క ఏడాదిలోనే నిర్వాసితులకు 2వేల కోట్లు ఇచ్చి వారికి అండగా నిలబడిన ఘనత కూటమి ప్రభుత్వానికి, గౌర ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.రూ.600 కోట్లతోఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తిచేసి 2026 సీజన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలిస్తామని స్పష్టం చేశారు.
వైసిపి పాలనలో మంత్రులు, ముఖ్యమంత్రి జగన్ సైతం, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో, అసలు పూర్తవుతుందో లేదో కూడా చెప్పలేమని చేతులెత్తేసిన చేతకానితనాన్ని మంత్రి నిమ్మల ఈ సందర్భంగా గుర్తు చేసి ఎద్దేవా చేశారు.జగన్ పాలనలో విధ్వంస మైన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏ రకంగా ట్రాక్ లో పెట్టారో కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రాజెక్ట్ లో ప్రధాన విభాగాల పనులు ఒకదాని తర్వాత ఒకటి కాకుండా సమాంతరంగా చేయటం,సమయం ఆదా చేయడం, సమర్థంగా చేయడం తమ ప్రభుత్వ ప్రత్యేకతగా రామానాయుడు స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా 2026 డిసెంబరు నాటికి పూర్తి పరిహారం చెల్లించడం, కాలనీలు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుని వడివడిగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.
అలాగే పోలవరం ప్రాజెక్టు ఆధారంగా నిర్మిస్తున్న హైడల్ పవర్ ప్రాజెక్ట్ పనులు కూడా ప్రాజెక్టుతో పాటు పూర్తి చేస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం చారిత్రక ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎంతో సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని మోడీకి, మాకు అనునిత్యం వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,(cm) ఆయనకు అండగా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రామానాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయి లో పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణ, పునరావాసం పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ ఆర్ కమీషనర్ ప్రశాంతి, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వి. అభిషేక్, ఏలూరు జాయింట్ కలెక్టర్ ఎం. అభిషేక్ గౌడ, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, ఈ ఎన్ సి నరసింహ మూర్తి, మేఘా ఇంజనీరింగ్ సి ఓ ఓ అంగర సతీష్ బాబు, ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ గంగాధర్ మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
















