కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల విపక్షాలు సైతం స్వాగతిస్తూ మాట్లాడుతున్నాయి. జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలను తీసుకుని రావడం ద్వారా పేదలు మధ్యతరగతి వర్గాలకు మోడీ ప్రభుత్వం చాలా వరకూ ఊరటను ఇచ్చింది. ముఖ్యంగా అతి పెద్ద వరంగా ఆరోగ్య భీమా ఉంది. ఇది ఇపుడు అందరికీ అవసరం కూడా. దీని మీద జీఎస్టీ విధింపు జీరో చేయడంతో దేశమంతా హర్షం వ్యక్తం అవుతోంది. గతంలో 18 శాతం ఉన్న దానికి ఏకంగా జీరోకు తెచ్చారు. అలాగే హెల్త్ కేర్ కి సంబంధించి ఉన్న 12 శాతం స్లాబ్ ని 5 శాతం స్లాబ్ లోకి చేర్చడం మంచి పరిణామం అని అంటున్నారు.
ఇక ఆహార సామాగ్రితో పాటు టెక్స్ టైల్స్ రంగంలో కూడా 12 శాతంగా ఉన్న జీఎస్టీ స్లాబ్ ని 5 శాతానికి తెచ్చారు. సిమెంట్ ధరల విషయంలో విశేష ప్రభావం చూపేలా 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించడం వల్ల మాధ్యతరగతి వర్గాలు గృహ నిర్మాణం పనులు సులువుగా చేసుకునేందుకు వీలు కలుగుతుంది అని అంటున్నారు. ఇక రైతులకు మేలు చేసేలా వ్యవసాయ పరికరాల మీద ఉన్న 18 శాతం జీఎస్టీ స్లాబ్ ని 5 శాతానికి చేర్చారు. అలాగే ఇతర కేటగిరీల విషయంలో స్లాబ్ ని తగ్గించడం వల్ల భారీ ఊరట కలుగుతుంది అని అంటున్నారు.
అయితే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉదారత చూపించడానికి బీహార్ ఎన్నికలు కారణమా అన్న చర్చ సాగుతోంది. బీహార్ లో ఈసారి గట్టి పోటీ ఉండబోతోంది అని అంటున్నారు. అంతే కాదు ఇండియా కూటమి రాహుల్ తాజాగా నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రతో బాగా పుంజుకుంది అని అంటున్నారు. అదే విధంగా యాంటీ ఇంకెంబెన్సీ ఎన్డీయే ప్రభుత్వం మీద హెచ్చుగా ఉండబోతోంది అని కూడా అంటున్నారు. దాంతో బీహార్ ఎన్నికల ముందు ఈ భారీ ఉపశమనం అన్నది ఒక విధంగా వ్యూహాత్మకమా అన్న చర్చ కూడా వస్తోంది అంటున్నారు.
మరో వైపు చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన మేలుగానూ చెబుతున్నారు. భారీ ఎత్తున ట్రారిఫ్ లను విధించి ఇండియాను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్ ఎకానమీని కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది అని అంటున్నారు. దీని వల్ల రానున్న రోజులలో ఆర్థికంగా కొంత రిలీఫ్ లభిస్తుంది అని అంటున్నారు. ఇలా బహుముఖీయమైన కారణాలు కూడా ఈ భారీ ఊరట వెనక ఉన్నాయని చెబుతున్నారు.
ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అయితే జీఎస్టీ స్లాబుల తగ్గింపుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే తనదైన శైలిలో మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. గత ఎనిమిదేళ్లుగా భారీ స్లాబులతో ప్రజలను ఇబ్బంది పెట్టారు అని అంటోంది. ట్రంప్ ప్రభావం బీహార్ ఎన్నికల వల్లనే ఈ విధంగా కేంద్రం చర్యలకు దిగింది అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం వ్యాఖ్యానించారు. నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కనుక తాము ఏనాటి నుంచో కోరుతున్నట్లుగా ఇంతకు ముందే ఎందుకు నిర్ణయం తీసుకోలేదని కూడా ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద చూస్తే ప్రతీ ప్రతికూలత తరువాత అనుకూలత ఉంటుంది అని అంటారు. ఆ విధంగానే ఇపుడు ట్రంప్ ప్రభావమో ఎన్నికల మహిమో తెలియదు కానీ దేశంలోని పేదలకు మధ్యతరగతి వర్గాలకు మంచి రోజులే వచ్చాయని అంతా అంటున్నారు. అయితే ఎన్డీయే నేతలు మాత్రం పేదల కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే తామే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ఏది ఏమైనా సామాన్యుడికి కొంత నిలదొక్కుకునే చాన్స్ అయితే ఈ జీఎస్టీ సంస్కరణలు ఇచ్చాయని అంటున్నారు.















