ప్రస్తుతం ఏ నోట విన్నా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) మాటే. ఏఐ వినియోగం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. ఈ తరుణంలో ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ చాట్‌జీపీటీ (ChatGPT) చాట్‌బాట్ వంటివి సంచలనాలు సృష్టిస్తుంటే.. మెటా కూడా ఎక్కడా తగ్గకుండా.. తన సేవల్ని మరింత మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మెటా ఏఐ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేక ఫీచర్లతో ఈ అప్లికేషన్‌ను తీసుకొచ్చింది.
చాట్ జీపీటీకి యూజర్ బేస్ పెరిగిన నేపథ్యంలో అనేక ఏఐలు పోటీగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో మెటా నుంచి కూడా తాజాగా కొత్త ఏఐ యాప్ వెలుగులోకి వచ్చేసింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలగిన ఈ యాప్, చాట్‌బాట్ రంగంలో చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై ఉచితంగా అందుబాటులో ఉంది. దీని ఇంటర్‌ఫేస్ ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, దీని రెస్పాన్స్ మరింత సహజంగా, మనిషిలా అనిపించేలా రూపొందించారు. కేవలం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా చాట్, రచనలు, హ్యూమర్, సహాయక సమాచారం ఇలా అనేక రంగాల గురించి అద్భుతంగా సమాచారం అందిస్తుంది.
లామా 4 లాంగ్వేజ్ మోడల్‌తో రూపొందింది ఈ కొత్త ఏఐ యాప్. ఈ ఏఐతో మాట్లాడటం మరింత సులభమట. ఎలాంటి ప్రశ్నలకైనా సునాయాసంగా సమాధానం చెప్పగలదని కంపెనీ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ఫేస్‌బుక్‌లో ప్రతిరోజూ చాలామంది మెటా ఏఐని వినియోగిస్తున్నారు. ఈ యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అప్లికేషన్‌ను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకూ ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.
మెటా ఏఐ యాప్‌లో వాయిస్ చాట్ మోడ్ సూపర్ హైలైట్ అని చెప్పవచ్చు. లామా 4 ఏఐ మోడల్‌తో నడిచే ఈ ఫీచర్ ద్వారా మీరు చేతులు ఉపయోగించకుండా సహజంగా మాట్లాడొచ్చు. ఇమేజ్ క్రియేషన్, ఎడిట్ చేయడం కూడా వాయిస్‌తో సాధ్యం. ఫుల్-డ్యూప్లెక్స్ స్పీచ్ టెక్నాలజీతో మరింత మానవీయ అనుభూతి ఉంటుంది. కానీ ఇది ప్రస్తుతం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
మెటా ఏఐ వాయిస్ ఫీచర్ సాయంతో చాట్‌బాట్‌తో సంభాషిస్తూ డివైజ్‌లో ఇతర యాప్‌లు ఉపయోగించొచ్చు. అంటే మల్టీటాస్కింగ్ చేయవచ్చన్న మాట. ఇకపోతే మైక్రోఫోన్ ఆన్‌లో ఉందని తెలియజేసేందుకు స్క్రీన్‌పై ఓ ఐకాన్ ఉంటుంది. ఈ ఏఐ అసిస్టెంట్‌తో ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే దీనికోసం టెక్ట్స్ లేదా వాయిస్ ఏ రూపంలో నైనా ప్రాంప్ట్‌ను అందిచొచ్చు.
ఈ యాప్‌లో డిస్కవర్ ఫీడ్ అనే స్పెషల్ ఫీచర్ ఉంది. ఇక్కడ యూజర్లు తమ ఏఐ ప్రాంప్ట్‌లు, ఇమేజ్‌లు, చాట్‌బాట్ రిప్లయ్‌లను షేర్ చేయొచ్చు. ఇతరులు వాటిని లైక్ చేయొచ్చు, కామెంట్ లేదా రీమిక్స్ చేయొచ్చు. మెటా రే బాన్ స్మార్ట్ గ్లాసెస్‌తో కూడా ఈ యాప్ లింక్ అవుతుంది. గ్లాసెస్‌లో స్టార్ట్ చేసిన సంభాషణలను యాప్ లేదా వెబ్‌సైట్‌లో కొనసాగించొచ్చు. ఇమేజ్ ఎడిటింగ్, గ్యాలరీ యాక్సెస్ వంటివి కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. అయితే.. ఈ మెటా ఏఐ యాప్ పూర్తిగా ఉచితం. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేదు. భారత్‌లో యూజర్లు ఇప్పుడే దీన్ని డౌన్‌లోడ్ చేసి టెక్స్ట్ ఆధారిత ఏఐ ఫీచర్లను ట్రై చేసుకోవచ్చు.