ప్రముఖ టెక్ సంస్థ జోహో కార్పొరేషన్‌కు చెందిన స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ అనూహ్యమైన ఆదరణతో దూసుకెళుతోంది. ఈ యాప్‌ను వాట్సాప్‌లాంటి క్లోజ్డ్ నెట్‌వర్క్‌గా కాకుండా, యూపీఐ, ఈమెయిల్ తరహాలో స్వేచ్ఛాయుత (ఓపెన్) ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దుతామని సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు మంగళవారం స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 21 నుంచి 27 మధ్య వారం రోజుల్లోనే అరట్టై యాప్ డౌన్‌లోడ్లు ఏకంగా 185 రెట్లు పెరిగాయని సెన్సార్ టవర్ డేటా వెల్లడించింది. ఇదే సమయంలో రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 40 రెట్లు పెరిగింది. ప్రభుత్వ ప్రతినిధులు ఈ యాప్ గురించి ప్రస్తావించిన తర్వాతే డౌన్‌లోడ్లు ఒక్కసారిగా పెరిగాయని తెలుస్తోంది. గతంలో రోజుకు 300గా ఉన్న డౌన్‌లోడ్లు, సెప్టెంబర్ 25 నుంచి సగటున లక్షకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా శ్రీధర్ వెంబు మాట్లాడుతూ, “మాకు గుత్తాధిపత్యం (మోనోపలీ) సాధించాలనే ఆలోచన లేదు. యూపీఐని నేను ఎంతగానో అభిమానిస్తాను, దాని రూపకర్తల పనితీరును గౌరవిస్తాను. ఈమెయిల్, యూపీఐ మాదిరిగానే అరట్టై కూడా సురక్షితమైన, స్వేచ్ఛాయుత వేదికగా ఉండాలన్నదే మా లక్ష్యం” అని వివరించారు.
అరట్టై సహా తమ ఉత్పత్తులన్నీ భారత్‌లోనే తయారయ్యాయని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. యూజర్ల డేటాను పూర్తిగా దేశంలోని ముంబై, ఢిల్లీ, చెన్నైలలోని డేటా సెంటర్లలోనే భద్రపరుస్తున్నామని, ఒడిశాలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తాము అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) లేదా గూగుల్ క్లౌడ్ వంటి పబ్లిక్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం లేదని, సొంత హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌పైనే ఆధారపడతామని ఆయన తేల్చిచెప్పారు.
ఆకస్మికంగా పెరిగిన యూజర్ల వల్ల సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయని కంపెనీ పేర్కొంది. కేవలం మూడు రోజుల్లోనే రోజువారీ రిజిస్ట్రేషన్లు 3,000 నుంచి 3.5 లక్షలకు చేరడంతో, అత్యవసరంగా మౌలిక సదుపాయాలను పెంచాల్సి వచ్చిందని వెంబు తెలిపారు. 2021లో ప్రారంభమైన అరట్టై యాప్‌లో ఇప్పటికే వాయిస్, వీడియో కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యం ఉంది. త్వరలో మెసేజ్‌లకు కూడా ఈ భద్రతను అందిస్తామని కంపెనీ తెలిపింది.